Begin typing your search above and press return to search.

కెనడాలో మరో ట్రంప్ క్యారెక్టర్.. కాకుంటే మనమ్మాయే!

కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లుగా జస్టిన్ ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన తదుపరి వారసుల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Jan 2025 4:38 AM GMT
కెనడాలో మరో ట్రంప్ క్యారెక్టర్.. కాకుంటే మనమ్మాయే!
X

ప్రపంచం ఎట్లా పోయినా ఫర్లేదు.. మనం మాత్రం బాగుండాలన్న ధోరణి ఒకటి ఉంటుంది. దీనికి భిన్నంగా అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలనుకోవటం మరో తీరు. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని అనుకున్నప్పుడు.. అందరూ బాగుండాలని అనుకోవటం బాగుంటుంది.కానీ.. ట్రంప్ తీరు అందుకు భిన్నం. అమెరికా ఫస్ట్ అన్న నినాదం పేరుతో.. ప్రపంచం ఎలా పోయినా ఫర్లేదు.. అమెరికా.. అమెరికన్లు మాత్రమే బాగుండలన్న తీరు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఒక ట్రంప్ తో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. ఇలాంటి వేళ.. ట్రంప్ క్యారెక్టర్ కు దగ్గరగా ఉండే మహిళా నేత ఒకరు కెనడాలో ఇప్పుడు పాపులర్ అవుతున్నారు.

కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లుగా జస్టిన్ ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన తదుపరి వారసుల మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో భారత సంతతికి చెందిన వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న అనితా ఇందిరా ఆనంద్.. రేసు నుంచి తప్పుకుంటున్నట్లుగా పేర్కొనటం తెలిసిందే. తాజాగా భారత మూలాలు ఉన్న రూబీ ఢల్లా వచ్చారు.

ఆమె పేరు తెర మీదకు వచ్చినప్పటి నుంచి ట్రంప్ తరహాలో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందరి చూపు తన మీద పడేలా.. తన మాటల గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేస్తున్నారు. తాను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని హామీ ఇవ్వటం మొదలు పెట్టారు. ఇంతకూ ఈ రూబీ ఢల్లా ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

పంజాబ్ నుంచి 1970లలో కెనడాలకు వలస వెళ్లిన కుటుంబంలో జన్మించారు రూబీ. భిన్న కుటుంబ నేపథ్యం ఉన్న రూబీ.. అందాల పోటీలు.. నటన.. వ్యాపార.. తదితర రంగాల్లో ఇప్పటికే తన ముద్ర వేశారు. కెనడాతో పాటు.. అక్కడి లిబరల్ పార్టీ అంటే మక్కువ చూపే ఆమె.. తనను తాను స్వయంక్రషితో ఎదిగిన వ్యాపారవేత్తగా చెప్పుకుంటారు. 1993లో మిస్ ఇండియా - కెనడా అందాల పోటీలో పాల్గొని రన్నరప్ గా నిలిచారు. వ్యాపారవేత్తగా ఎదిగిన ఆమె ఢల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

ఆమె విద్యార్హతల విషయానికి వస్తే పొలిటికల్ సైన్స్ లో మైనర్ తో పాటు బయో కెమిస్ట్రీలో డిగ్రీ చేవారు. అనంతరం డాక్టర్ ఆప్ చిరోప్రాక్టిక్ పట్టాను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చిరో ప్రాక్టర్ (వీరు వైద్యులు కాదు. కాకుంటే.. ఎముకలు..కండరాలు.. నరాలు పట్టేసినప్పుడు వాటిని సర్దుబాటు చేస్తుంటారు).. నటిగా పని చేసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో వ్యాపారవేత్తగా రాణించారు.

నిజానికి రూబీకి చిన్న వయసు నుంచే రాజకీయాలంటే ఆసక్తి. ఆమెకు పద్నాలుగేళ్ల వయసులోనే లిబరల్ పార్టీలో పని చేసినట్లుగా చెబుతారు. 2004లో బ్రాంప్టన్ - స్ప్రింగ్ డేల్ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైన ఆమె.. 2011 వరకు ఎంపీగా వ్యవహరించారు. కెనడా పార్లమెంట్ కు వరుసగా మూడుసార్లు ఎన్నికైన భారత సంతతి మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా తనను తాను ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్లుగా ప్రకటించుకున్న ఆమె.. ట్రంప్ మాదిరి మాట్లాడుతున్నారు. కెనడాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని స్పష్టం చేస్తున్నారు.

దీంతో.. ఈమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడే రూబీ ఢల్లాకు సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని చెబుతుంటారు. ఆమెకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాశారు. అప్పట్లో పంజాబ్ లో హింసాత్మక ఘటనలు.. ఆపరేషన్ బ్లూస్టార్ పై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ.. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన చేశారు. ఈ లేఖ గురించి ఇందిరాగాంధీ ఒక మీడియా సమావేశంలో ప్రస్తావించటంతో రూబీ ఢల్లా పేరు అప్పట్లో అందరి నోట నానింది. అలా తొలిసారి ఆమె పేరు ప్రపంచానికి పరిచయమైంది.

తాను ప్రధానమంత్రిగా ఎన్నిక అయితే అక్రమ వలసదారులను బహిష్కరించటంతో పాటు మానవ అక్రమ రవాణాను కట్టడి చేస్తానని.. ఇదే తానిచ్చే హామీగా పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆమె మాటలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోనట్లుగా ఉండటంతో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. ట్రంప్ మాదిరి ఇస్తున్న హామీలకు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కెనడాకు కొత్త ప్రధానమంత్రి ఎంపిక మార్చి 9న జరగనుంది.