Begin typing your search above and press return to search.

'రుద్ర రచన'.. ఈ అమ్మాయి గురించి తెలిస్తే వావ్ అనేస్తారు

మంత్రి కేటీఆర్ విపరీతమైన ఆనందానికి గురయ్యారు. 'ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది'

By:  Tupaki Desk   |   15 Aug 2023 3:51 AM GMT
రుద్ర రచన.. ఈ అమ్మాయి గురించి తెలిస్తే వావ్ అనేస్తారు
X

కొన్నిసార్లు గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. భారీ విజయాలు సాధించాల్సిన అవసరం లేదు. మంచి మనసు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకురావటమే కాదు.. వేలాది మందికి కొత్త స్ఫూర్తిగా మారుతుంటుంది. తాజాగా అలాంటి పనే చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది రుద్ర రచన. ఐదారేళ్ల క్రితం సాయం కోసం ఎదురుచూసిన ఆ కళ్లు.. ఇప్పుడు సాయం చేసే స్థాయికి చేరటం ఒక ఎత్తు అయితే.. తాను తీసుకున్న ఫలానికి ప్రతిఫలాన్ని ఇచ్చేయటమే తన లక్ష్యమన్న ఆమె తీరు అందరి చేత ప్రశంసలు పొందేలా చేస్తోంది.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లిదండ్రులు లేని ఆమె గురించి తెలిసిన మంత్రి కేటీఆర్ ఆమెకు అండగా నిలవటమే కాదు.. ఆమె బీటెక్ పూర్తి చేసేందుకు సాయం చేశారు. అప్పట్లో ఆమె విద్యాభాస్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకున్న రుద్ర రచన.. తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీటెక్ పూర్తి చేసింది.

సొంత కష్టంగా ఉద్యోగాన్ని సాధించింది. అక్కడితో ఆగని ఆమె.. తాజాగా తాను సంపాదించిన జీతంతో రూ.లక్ష మొత్తాన్ని పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతుగా విరాళాన్ని పంపింది. అక్కడితో ఆగని ఆమె.. ఒక ట్వీట్ చేసింది. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ అంగా నిలిచి.. బీటెక్ పూర్తి అయ్యేలా చేశారని పేర్కొంటూ.. 'ఇటీవల ఉద్యోగాన్ని సంపాదించా. నా జీతంగా వచ్చిన దాన్లో రూ.లక్షను సీఎం సహాయ నిధికి అందించా. మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికి మరవలేను' అంటూ ట్వీట్ చేసింది.

దీని గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విపరీతమైన ఆనందానికి గురయ్యారు. 'ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది' అంటూ తన భావోద్వేగాన్ని ప్రదర్శిస్తూ.. గతంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకున్న రచన ఫోటోతో పాటు.. తనకు రాఖీ సందర్భంగా కట్టిన ఫోటోను.. తాజాగా సీఎం సహాయ నిధికి పంపిన రూ.లక్షచెక్ ను పోస్టు చేశారు.

సాయం పొందటం అందరూ చేస్తారు. కానీ.. తీసుకున్న సాయాన్ని తిరిగి ఇచ్చేసేందుకు సిద్ధమయ్యే రుద్ర రచన వారు మాత్రం ఎందరికో స్ఫూర్తిగా నిలవటమే కాదు.. మరెందరికో సాయం అందించాలన్న భావన కలిగేలా పలువురికి కలిగేలా చేస్తారని మాత్రం చెప్పక తప్పదు. శభాష్ రుద్ర రచన.