విడాకుల బాటలో మోస్ట్ పాపులర్ అమెరికా మాజీ అధ్యక్ష దంపతులు?
అమెరికా అధ్యక్ష దంపతుల్లో అత్యంత పాపులర్ అయినది బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా. ఉన్నత విద్యావంతులైన వీరు 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
By: Tupaki Desk | 16 Jan 2025 2:30 PM GMTఅమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా సరే.. ఆయన సతీమణి ఎవరనేది కూడా చూస్తారు.. ‘ఫస్ట్ లేడీ’గా ఆమెకు తగిన ప్రాధాన్యం కూడా ఉంటుంది. అధ్యక్షుడి వెంట విదేశీ ప్రయాణాల్లోనూ ఈ ఫస్ట్ లేడీ ఉండడం మనం చూసే ఉంటాం. అమెరికా అధ్యక్ష దంపతుల్లో అత్యంత పాపులర్ అయినది బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా. ఉన్నత విద్యావంతులైన వీరు 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న 2008-16 మధ్య కాలంలో భార్యతో ఆయన అన్యోన్యత స్పష్టంగా కనిపించేది. మిచెల్ సైతం సొంత వ్యక్తిత్వంతో ఆకట్టుకునేవారు. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గానూ పేరు తెచ్చుకున్నారు. వీరికి సాషా, మాలియా అనే ఇద్దరు కుమార్తెలు. ఈ ఫ్యామిలీ ఫొటోలు కూడా మీడియాలో బాగా వచ్చేవి. అయితే, అధ్యక్షుడు కావడానికి ముందే ఒబామా దంపతులు విడిపోవాలని భావించారట. 1992లో వివాహం కాగా.. 2000 సంవత్సరంలో
మిచెల్ తన భర్త బరాక్ ఒబామాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నారట. అంటే ఎనిమిదేళ్లకే వీరి వైవాహిక బంధం బీటలు వారినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని 2012లో విడుదలైన ఓ పుస్తకంలో మిచెల్ పేర్కొన్నారు.
వాస్తవానికి అన్ని సంసారాల్లో ఉన్నట్లే ఒబామా కుటుంబంలోనూ విభేదాలు ఉన్నాయట. తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న స్పర్థలు ఎదురైనా.. కౌన్సెలింగ్ తో వాటిని అధిగమించినట్లు కూడా మిచెల్ తెలిపారు. ఒబామా మాత్రం ఎన్నడూ తన వైవాహిక బంధం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
అమెరికాకు ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా చేసిన సమయంలోనూ ఒబామా తన కుటుంబ జీవితానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించింది. మిచెల్ తో అయితే అప్పట్లో మోస్ట్ పాపులర్ కపుల్.
విడిపోతున్నారా?
పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్ల తర్వాత బరాక్ ఒబామా దంపతులు మళ్లీ వార్తల్లోకెక్కారు. వీరు త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న జరిగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఒబామా మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వందేళ్లు జీవించిన అమెరికా మాజీ అధ్యక్షుడిగా రికార్డుల్లో నిలిచి, గత నెలలో చనిపోయిన జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకూ మిచెల్ హాజరుకాలేదు. దీంతోనే ఒబామాతో విడిపోతున్నట్లుగా కథనాలు వచ్చాయి.