పరుగో పరుగు.. ఎన్నికల చిత్రాలు ఇన్నిన్ని కాదయా!!
మరికొందరు భార్యలతో హారతులు పట్టించుకుని, కుంకుమలు పెట్టించుకుని సంగరాంగణంలో ముందు కు దూకారు. మొత్తంగా.. ఎవరికి నచ్చిన సెంటిమెంటును వారు పాటించారు.
By: Tupaki Desk | 10 Nov 2023 7:38 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌లకు గడువు శుక్రవారం మధ్యాహ్నంతో ముగియ నుంది. అయితే.. శుక్రవారం చివరి రోజే అయినా.. తిధి బాగోకపోవడం.. వర్జ్యం వంటివి ఉండడంతో అన్ని పార్టీల కీలక అభ్యర్థులు గురువారమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. ఈక్రమంలో కొందరు నాయకులు చాలా పాట్లు పడ్డారు. కొందరు అన్నం కూడా తినకుండానే నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు.
మరికొందరు భార్యలతో హారతులు పట్టించుకుని, కుంకుమలు పెట్టించుకుని సంగరాంగణంలో ముందు కు దూకారు. మొత్తంగా.. ఎవరికి నచ్చిన సెంటిమెంటును వారు పాటించారు. ఈ క్రమంలో నామినేషన్ కేంద్రాల ముందు పెద్ద కోలాహలంతో కూడిన వాతావరణం కనిపించింది. ఇక, నామినేషన్లకు సాయంత్రం 5 గంటల వరకే సమయం(గురువారం) ఉండడంతో చాలా మంది ఉరుకులు పరుగులు పెడుతూ ముందుకు సాగారు.
ఇలాంటి వారిలో మునుగోడు నుంచి గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం దక్కించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన గురువారం సాయంత్రం చివరి 20 నిమిషాల వ్యవధిలో నామినేషన్ దాఖలు చేశారు. అప్పటికే తన మిత్రుడు, వ్యాపార భాగస్వామి నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం ఆహ్వానం మేరకు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఒకింత ఆలస్యమైంది. దీంతో తన నామినేషన్ విషయాన్ని దాదాపు కోమటిరెడ్డి మరిచిపోయారు.
ఇక, చివరి గంటలో ముహూర్తం, వర్జ్యం వంటివి గుర్తుకు రాగా.. హుటాహుటిన ఆయన మునుగోడు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. మరో 20 నిమిషాలు మాత్రమే సమయం ఉండడం.. దాదాపు 200 మీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఉండడంతో వాహనాలు ఆర్వో ఆఫీసు వరకు వెళ్లే అవకాశం లేదు. దీంతో ఆర్వో కేంద్రంలోకి.. కోమటిరెడ్డి పరుగులు పెట్టుకుంటూ.. వెళ్లడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది