అంతకంతకూ బక్కచిక్కుతున్న రూపాయి.. చరిత్రలోనే తాజా కనిష్ఠం
గత ఏడాది చివరిలో మొదలైన రూపాయి పతనం.. అంతకంతకూ తగ్గిపోతోంది. డాలర్ మారకంతో రూపాయి విలువ నానాటికీ క్షిణిస్తోంది.
By: Tupaki Desk | 9 Jan 2025 8:30 AM GMTగత ఏడాది చివరిలో మొదలైన రూపాయి పతనం.. అంతకంతకూ తగ్గిపోతోంది. డాలర్ మారకంతో రూపాయి విలువ నానాటికీ క్షిణిస్తోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై.. చరిత్రలో తొలిసారి సరికొత్త కనిష్ఠాన్ని నమోదు చేసింది. తాజా ధరను చూస్తే ఒక డాలర్ కు రూ.86 దగ్గరకు వచ్చేసింది. గత ఏడాదితో పోలిస్తే రూపాయి విలువ మూడు శాతం కరిగిపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? రూపాయి క్షీణతతో కలిగే లాభం ఏమిటి? ఎదురయ్యే నష్టం ఏమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి.
అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ అనిశ్చితి రూపాయి క్షీణతకు కారణంగా చెప్పాలి. దీనికి తోడు మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న నేపథ్యంలో మిగిలిన కరెన్సీలతో పోలిస్తే.. అమెరికన్ డాలర్ అంతకంతకూ బలపడుతుండగా.. పెరుగుతున్న వాణిజ్య లోటు.. ముడి చమురు రేట్లతో రూపాయి బక్కచిక్కుతోంది. రూపాయి పడిపోవటం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభం చేకూరేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగుతోంది.
సాధారణ ప్రజల విషయానికి వస్తే.. విదేశీ ప్రయాణం.. విదేశీ విద్య లాంటివి ఖరీదైనవిగా మారనున్నాయి. రూపాయి పతనంతో దిగుమతి వస్తువులు.. వస్తుసేవలు మరింత ప్రియం కానున్నాయి. దిగుమతులు ప్రధానంగా ముడి చమురు.. పసిడి మీద భారత్ భారీగా ఆధారపడుతోంది. పెట్రోల్ తో మొదలయ్యే అవసరాలు.. ప్లాస్టిక్.. ఎరువులు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు.. వస్తు సేవల్లోనూ క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ముడిచమురు ధర పెరిగిందంటే.. దానితో లింకు ఉన్న అన్నింటి రేట్లు పెరుగుతాయన్నది తెలిసిందే.
బక్కచిక్కే రూపాయితో దిగుమతుల భారం ఎంత భారీగా ఉంటుందన్న దానికి ఇక్కడో చిన్న ఉదాహరణ చెప్పొచ్చు. డాలరుతో రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా నమోదవుతుంది. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.1.27 లక్షల కోట్లకు పెరగొచ్చు.డాలరు మారకంతో రూపాయి విలువ తగ్గే కొద్దీ వంట నూనెలు.. పప్పులు.. యూరియా.. డీఎపీలు దిగుమతుల మీదా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం వాడే స్మార్ట్ ఫోన్లలో 80 నుంచి 90 శాత వరకు దిగుమతి చేసుకునే విడిభాగాలే ఉంటాయి. రూపాయి విలువ తగ్గిపోవటంతో స్మార్ట్ ఫోన్లతో పాటు.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకునే బొగ్గును కూడా వాడటం తెలిసిందే. రూపాయి విలువ తగ్గిపోవటంతో బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలుయూనిట్ కు నాలుగు పైసలు మేర మారిపోతాయి. విదేశీ విద్య ఖరీదెక్కుతోంది. గత ఏడాదినే లెక్కల్లోకి తీసుకుంటే.. పడిపోయిన రూపాయి విలువతో రూ.1.51 లక్షల అదనపు భారం ఒక్కో విద్యార్థి మీదా పడిన పరిస్థితి.
రూపాయికి బొమ్మ ఎలానో.. బొరుసు కూడా అలానే. అదే తీరులో ఒక అంశంలో ప్రతికూలతలతో పాటు.. సానుకూలతలు కూడా ఉంటాయి. అందుకు రూపాయి క్షీణత విషయంలోనూ ఉంటుంది. డాలరుతో రూపాయి మారక విలువ పడిపోవటం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంది. వాహనాలు ఎగుమతి చూసే బజాజ్ ఆటో.. మారుతీ సుజుకీ లాంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి మారక విలువ తగ్గటం.. ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాలు పెరుగుతాయి. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతం.
మరోవైపు దిగుమతి ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ.. ఆడి.. వోల్వో లాంటి కరంపెనీలకు మాత్రం రూపాయి విలువ క్షీణత ప్రతికూలంగా మారుతుంది. ఎందుకుంటే.. ఈ కార్ల ధరల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా మారుతుంది. ఐటీ రంగానికి కూడా రూపాయి క్షీణత మేలు చేస్తుంది. ఎందుకంటే.. చాలా సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటంతో రూపాయి విలువలో ఒక శాతం క్షీణత ఉంటే.. ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం.. లాభం 1.5 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మూడో త్రైమాసికంతో పోలిస్తే రూపాయి క్షీణత దగ్గర దగ్గర 1.25రూపాయిలకుపైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల లాభాలు 0.30 నుంచి 0.50 శాతం వరకు పెరగొచచని చెబుతున్నారు. రూపాయితో పాటు చైనా.. జపాన్.. మెక్సికో కరెన్సీల మారక విలువలుకూడా పడిపోవటంతో.. ఆకర్షణీయమైన ధరలకు సేవలు అందించే విషయంలో పోటీ పెరుగుతోంది. ఇది కూడా మనకు ప్రతికూలంగా మారుతుందని చెప్పాలి.