జెండాలు దించేశారు.. రుషికొండ బీచ్ కు ఆ గుర్తింపు రద్దు!
దీనికి గల కారణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 2 March 2025 9:12 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా విశాఖలోని రుషికొండకు పేరుండగా.. ఇప్పుడు అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు రద్దయ్యింది. దీనికి గల కారణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఊహించని దెబ్బే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా రుషికొండకు పేరున్న సంగతి తెలిసిందే. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్ గా 2022లో ధ్రువీకరించారు. ఆ గుర్తింపును డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్.ఈ.ఈ.) సంస్థ అందిస్తుంది.
అయితే.. అంతటి ప్రాధాన్యమున్న గుర్తింపు తాజాగా రద్దయ్యింది. దీంతో.. తీరంలోని జెండాలను పర్యాటకశాఖ అధికారులు కిందకు దించేశారు. ఇలా రుషికోండ బీచ్ కు ఇచ్చిన గుర్తింపును ఎఫ్.ఈ.ఈ. సంస్థ అకస్మాత్తుగా రద్దు చేయడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా ఈ రద్దుకు గల కారణాలు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... కొంతకాలంగా రుషికొండ బీచ్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, శునకాలు రావడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయని.. అదే విధంగా... మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు తీసికట్టుగా మారాయని.. ఈ కారణాల వల్లే గుర్తింపు రద్దయ్యిందని చెబుతున్నారు.
ఇంత అధ్వాన్నంగా నిర్వహణ ఉండటంతో.. దీనికి సంబంధించిన ఫోటోలు డెన్మార్ సంస్థకు చేరాయని.. గత నెల 13న ఈ మెయింట్ నెన్స్ పై ఫిర్యాదులు చేశారని అంటున్నారు. దీంతో.. రంగంలోకి దిగిన సంస్థ ప్రతినిధులు ఈ మేరకు పరిశీలించి, గుర్తింపు రద్దు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
అయితే... దీనిపై ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ, ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించాల్సి ఉంది!