రుషికొండ ప్యాలెస్.. వెలుగులోని మరో సంచలన అంశం!
కాగా రుషికొండపై నాటి సీఎం జగన్ కుటుంబం కోసం నిర్మించిన ఆ భవనాలకు విద్యుత్ శాఖ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
By: Tupaki Desk | 7 July 2024 9:09 AM GMTవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ. విశాఖపట్నంలో సముద్ర తీరాన ఉన్న బీచ్ ఒడ్డున ఉన్న రుషికొండకు నున్నగా గుండు కొట్టినట్టు కొట్టి వాటిపైన పర్యాటక రిసార్టుల ముసుగులో జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్ల ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. చివరకు జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి రుషికొండపై నిర్మించిన ఈ భవనాలయితే అనుకూలంగా ఉంటాయని.. ఐఏఎస్ అధికారులతో నియమించిన త్రీమెన్ కమిటీతో చెప్పించిందనే విమర్శలున్నాయి.
ఎన్నికల ఫలితాల్లో జగన్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చి.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడి ఉంటే ఈపాటికి రుషికొండపై ఉన్న భవనాల్లో జగన్ కొలువుదీరేవారు. తన ప్రమాణస్వీకారం విశాఖలోనే ఉంటుందని.. జూన్ 9 ప్రమాణస్వీకారం చేస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్టు వైసీపీ ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో జగన్ ఆశలు ఆవిరయ్యాయి.
కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రుషికొండవైపు ఎవరినీ వెళ్లనీయలేదు. పర్యాటకులతోపాటు చివరకు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తదితరులను సైతం అడ్డుకున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్, అటవీ శాఖల అనుమతులు కూడా తీసుకోకుండా రుషికొండను తొలిచి ఈ భవనాలను నిర్మిస్తున్నారని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రుషికొండ ప్యాలెస్ ఏ రేంజులో ఉందో ప్రపంచానికి వెల్లడైంది. అంతర్జాతీయ స్థాయి ఇంటీరియర్ తో దీన్ని నిర్మించారని స్పష్టమైంది. కేవలం ఒక్క బాత్ టబ్బుకే రూ.30 లక్షలు చెల్లించారని తేలింది. ఇంకా స్పాలు, విశాలమైన బెడ్ రూములు.. ఇలా ప్రతి ఒక్కటీ కళ్లు చెదిరే రేంజులో ఉన్నాయి.
కాగా రుషికొండపై నాటి సీఎం జగన్ కుటుంబం కోసం నిర్మించిన ఆ భవనాలకు విద్యుత్ శాఖ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ భవంతులకు వాడిన విద్యుత్ కు సంబంధించి రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ ఈ నోటీసులు ఇచ్చింది.
కాగా రుషికొండ భవంతులకు రెండు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇందులో ఒకదానికి (వీఎస్‌పీ2335) నెలకు సగటున రూ.80 వేలు, మరో సర్వీస్(వీఎస్‌పీ2322)కు నెలకు సగటున రూ.7 లక్షలు బిల్లు వస్తోందని చెబుతున్నారు. ఈ భవనాల్లో ప్రస్తుతం ఎవరూ ఉండకపోయినా విద్యుద్దీపాలతో మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో రోజుకు రెండు వేల యూనిట్ల విద్యుత్ కాలుతోందని చెబుతున్నారు.
ఈ క్రమంలో గత ఏడాది నవంబరు నుంచి ఈ ఏడాది మే నెల వరకు రెండు సర్వీసులకు కలిపి రూ.54.52 లక్షల బిల్లు బకాయిలు ఉన్నట్టు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భవంతులకు నోటీసులు జారీ చేసి పదిహేను రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ రూ.54.52 లక్షల బిల్లులకు జూన్ నెల బిల్లు మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని కోరారు.
తవ్వే కొద్దీ రుషికొండ భవంతుల్లో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయని కూటమి నేతలు అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరెన్నో గుట్టుమట్లు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.