Begin typing your search above and press return to search.

రుషికొండ పాలెస్...వైసీపీ పెద్దలు ఎందుకు బయటకు రావడం లేదు ?

గత మూడేళ్ళుగా ఏపీలో రగులుతున్న రాజకీయంలో కీలకమైన సబ్జెక్ట్ గా విశాఖ రుషికొండ ఉంది

By:  Tupaki Desk   |   19 Jun 2024 1:30 PM GMT
రుషికొండ పాలెస్...వైసీపీ పెద్దలు ఎందుకు బయటకు రావడం లేదు ?
X

గత మూడేళ్ళుగా ఏపీలో రగులుతున్న రాజకీయంలో కీలకమైన సబ్జెక్ట్ గా విశాఖ రుషికొండ ఉంది. ఇక్కడ టూరిజం భవనాలను అర్ధాంతరంగా కూల్చేసి కొత్త కట్టడాలను అత్యంత రహస్యంగా నాటి వైసీపీ ప్రభుత్వం నిర్మించడానికి పూనుకోవడం తోనే ఇది పెను వివాదానికి దారితీసింది.

సాధారణంగా ప్రభుత్వ కట్టడాలు నిర్మించేటపుడు సీక్రెట్ ఎందుకు ఉంటుంది అన్నది ప్రశ్న. ఎవరైనా వాటిని చూడవచ్చు. లోటు పాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావచ్చు. ఎందుకు అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి. అయితే వైసీపీ ఆ అవకాశం ఎక్కడా ఏపీలో విపక్ష నేతలకు ఇవ్వలేదు. ఆఖరుకు టీడీపీ అధినేత చంద్రబాబు అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయినా కూడా రుషికొండ మీద ఏమి జరుగుతోంది అన్నది తెలుసుకోవాలని చూసినా అడ్డుకున్న పరిస్థితి ఉండేది.

దాంతో జనంలో ఎక్కడ లేని అనుమానాలు పెరిగిపోయాయి. ఏమి జరుగుతోంది అన్న ఆతృత తో పాటు ఏమైనా రహస్య నిర్మాణాలు చేస్తున్నారా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున సాగింది. ఇక పచ్చని చెట్లతో పర్యావరణంతో ప్రకృతికి ప్రతిరూపంగా రుషికొండ ఉండేది. అలాంటి దానిని బోడు గుండుగా చేసి పారేసింది వైసీపీ ప్రభుత్వం అని విపక్షాలు విమర్శలు చేసినా ఆనాటి సర్కార్ ఎక్కడా లెక్కచేయలేదు.

మొత్తం మీద చూస్తే రుషికొండ మీద రాజకోట రహస్యం అలాగే ఉండిపోయింది. దానిని సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. జగన్ అధికార నివాసం అన్నారు. టూరిజం కోసమే అని అన్నారు. ఏమి చెప్పినా అందులో పారదర్శకత లోపించడంతో ఇది చాలా పెద్ద ఇష్యూగా మారింది. రుషికొండ రహస్యం చేదించాలని అటు విపక్షాలకు ఇటు జనాలకు పట్టుదల పెరిగిపోయేలా చేయించింది వైసీపీ ప్రభుత్వమే.

దీని మీద కోర్టు కేసులు పడినా హరిత ట్రిబ్యునల్ సైతం పర్యావరణానికి హాని తలపెట్టే చర్యలు వద్దు అని చెప్పినా కూడా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న విమర్శలు వచ్చాయి. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాళాలు తీసి భవనాన్ని తెరిపించి లోకానికి రుషికొండ పాలెస్ సీక్రెట్ ని బట్టబయలు చేశారు.

కేవలం బాత్ రూం కోసమే కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేసారు అన్నది కూడా బయటపడింది అంటున్నారు. ఇక రుషికొండ భవనాలు వాటి మీద మీడియా ఇచ్చిన కధనాలు ఫోటోలు అన్నీ కూడా జాతీయ మీడియా సైతం ఫోకస్ పెట్టేలా చేసింది. అక్కడ కూడా ఇదే ఇష్యూ హైలెట్ అయింది. ఇలా గత కొద్ది రోజులుగా రుషికొండ పాలెస్ మీద వరస కధనాలు రావడం నాటి సీఎం జగన్ జల్సాలకు ప్రజా ధనం దుబారాకు ఇది నిదర్శనం అని విపరీతమైన విమర్శలు వస్తున్నా వైసీపీ నుంచి పెద్దగా ఎందుకు స్పందన లేదు అన్న చర్చ సాగుతోంది.

చోటా మోటా నాయకుల నుంచి రియాక్షన్ తప్ప పెద్ద నాయకులు ఎవరూ నోరు విప్పడం లేదు అని అంటున్నారు. ఒక విధంగా రుషికొండ పాలెస్ ని జగన్ ఫ్యామిలీకి ముడిపెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నా విపక్షాలు విరుచుకునిపడుతున్నా వైసీపీలో పెద్ద నాయకులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అయిదేళ్ల అధికారంలో ఎన్నో పదవులు అనుభవించిన వారు అంతా ఇపుడు ఎందుకు గమ్మున ఉన్నారు అన్నది కూడా అందరి మదిలో దొలిచే ప్రశ్నగా ఉంది.

అసలు ఎందుకు వైసీపీ పెద్ద నాయకులు ఈ అంశం మీద కౌంటర్ ఇవ్వడం లేదు అన్నదే అందరికీ పట్టుకుంది. మరో వైపు అయితే నేషనల్ మీడియా ఇదే అంశాన్ని పట్టుకుని గట్టిగానే కధనాలు రాస్తోంది. కేవలం బాత్ టబ్ కోసం 28 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని రాసి పారేస్తోంది.

అంతే కాదు వందల కోట్లు ధారపోసి నిర్మించిన ఈ రుషికొండ పాలెస్ సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుంది అన్న చర్చతో నేషనల్ మీడియా రచ్చ చేసి పారేస్తోంది. ఒక విధంగా గత ప్రభుత్వం బదనాం అయ్యే విధంగా మాజీ సీఎం జగన్ మీద కూడా ఘాటైన విమర్శలతో నేషనల్ మీడియా కధనాలు సాగుతున్నాయి.

ఇంత జరుగుతున్నా వైసీపీలో పెద్ద నోళ్ళు మాత్రం పూర్తిగా మౌనం పాటించడం పట్లనే అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ పెద్దలు పెద్ద మనుషులూ ఏమయ్యారో అని కూడా చర్చించుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జల్సాలు చేశారు జగన్ విలాసాలతో ప్రజా ధనం దుబారా చేశారు అని విమర్శలు చేస్తున్న తరుణంలో వైసీపీ నుంచి చిన్న నేతలు బయటకు వచ్చి జగన్ కి అండగా ఉంటూ కౌంటర్ ఇస్తున్నారు. కట్టింది ప్రభుత్వ భవనాలు అని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని విశాఖలో అతిధుల కోసం నిర్మించిన పాలెస్ అది అని కూడా చెబుతున్నారు.

మరి వారికి ఉన్న సోయి పెద్ద నేతలకు ఎందుకు లేకుండా పోయింది అన్న చచ అయితే సాగుతోంది. అసలు వైసీపీలో ఏమి జరుగుతోంది. వైసీపీ బలం అంతేనా ఓటమి తరువాత వైసీపీలో జగన్ వెంట ఉండేది ఎవరో ఈ ఒక్క ఇష్యూతో తేలిపోయిందా అని కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రుషికొండ పాలెస్ ఇష్యూలో వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు పడలేదన్న భావన అయితే వ్యక్తం అవుతోంది. దీంతో వైసీపీ టీడీపీ కూటమి సర్కార్ ముందు అతి భారీ తప్పు పాలనాపరంగా చేసి దొరికిపోయింది అన్నది జనంలోకి వెళ్ళిపోతోంది.