త్వరలో "సె*క్స్ మంత్రిత్వ శాఖ".. కొత్త ప్రతిపాదనకు కారణం ఇదే!
ఈ క్రమంలో త్వరలో "సెక్స్ మంత్రిత్వ శాఖ" కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Nov 2024 1:30 PM GMTరాష్ట్ర ప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ పలు రకాల మంత్రిత్వ శాఖలు.. వాటికి మంత్రులు, సహా మంత్రులు ఉంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రెవిన్యూ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, మొదలైన శాఖలు ఉంటాయి. ఈ క్రమంలో త్వరలో "సె*క్స్ మంత్రిత్వ శాఖ" కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు.
అవును... సుమారు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిగిపోయి ఉన్న రష్యా సరికొత్త సమస్యలు ఎదుర్కొంటోందని.. ఇందులో ప్రధానమైనది జనాభా సంబంధిత సమస్య అని అంటున్నారు. ఇందులో భాగంగా... గత కొన్నేళ్లుగా రష్యా జనాభాలో జనన - మరణాల్లో భారీ అంతరం ఏర్పడిందని.. ఇది ముందు ముందు రష్యాకు అతిపెద్ద సమస్యగా మారనుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే... "మినిస్ట్రీ ఆఫ్ సె*క్స్" పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు రష్యా ప్రభుత్వంలో ప్రతిపాదన వచ్చిందని.. దీన్ని కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ పరిశీలిస్తోందని అంటున్నారు. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. జనన మరణాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించే వ్యూహాల్లో భాగంగా ఓ ఏజెన్సీ ఈ మేరకు ఈ సలహా ఇచ్చిందని అంటున్నారు.
వాస్తవానికి ఇప్పుడు జనాభా సంబంధిత సమస్యలను చైనా, జపాన్, జర్మనీ వంటి పలు దేశాలు ఎదుర్కొంటున్నాయి! ఇందులో భాగంగా.. జననాల రేటు తగ్గిపోతుందని.. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని పలు దేశాలు లబోదిబోమంటున్నాయి! ఈ సమయంలో దంపతులకు పిల్లలను కనే విషయంలో బోలెడన్ని ఆఫర్లు, బహుమతులు ప్రకటిస్తున్నాయి పలు దేశాల ప్రభుత్వాలు.
ఈ సమయంలో డేటింగ్ కే ఆఫర్లు ప్రకటించాలని రష్యా ప్రభుత్వానికి సూచనలు అందాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. బంధాలను ప్రోత్సహించేందుకు యువతకు ఫస్ట్ డేట్ కోసం 5,000 రూబెల్స్ ఇవ్వాలని సూచనలు అందాయని చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని అసాధారణ ప్రతిపాదనలు చేసిందని కథనాలొస్తున్నాయి.
కాగా... 2023లో మొదటి ఆరు నెలల్లో (జనవరి - జూన్) 6,15,600 మంది పిల్లలు పుడితే... ఈ ఏడాది జూన్ వరకూ 5,99,600 మంది మాత్రమే జన్మించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, మరణాల విషయానికొస్తే... గత ఏడాదిలో 2,76,100 మంది మరణిస్తే.. ఆ సంఖ్య ఈ ఏడాది జూన్ వరకూ 3,25,100 గా ఉందని అంటున్నారు.
ఇలా... మరణాల సంఖ్య పెరుగుతుండటం.. జననాల రేటు తగ్గుతుండటం ఇప్పుడు రష్యాకు అతిపెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. దీంతో... 10 లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను కనే మహిళలకు మిల్లియన్ రూబెల్స్ (రూ.13 లక్షలకు పైనే) నజరానాతో పాటు "మదర్ హీరోయిన్" అవార్డును ఇస్తామని పుతిన్ సర్కార్ 2022లోనే ప్రకటించింది.
ఇలా ఎన్ని ఆలోచనలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు సరికదా.. సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతుందని చెబుతున్నారు. ఈ సమయంలోనే "మినిస్ట్రీ ఆఫ్ సెక్స్" అనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని అంటున్నారు!
మరోపక్క... ఉక్రెయిన్ తో యుద్ధం వేళ చాలా మంది యువత రష్యాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోయారని అంటున్నారు. ఇది కూడా ఇప్పుడు రష్యాకు అతిపెద్ద సమస్యగా మారిందని.. అందువల్లే ఉత్తర కొరియా నుంచి సైనిక సహాయం పోందాల్సి వచ్చిందని చెబుతున్నారు.