రష్యాపై ఆంక్షలు ఉండవు.. యుద్ధమూ ఆగదు.. ఇక ఎందుకీ వ్యర్థ ప్రయత్నాలు?
మూడేళ్లవుతోంది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి.. కానీ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితి మారుతోంది..
By: Tupaki Desk | 5 March 2025 1:00 AM ISTమూడేళ్లవుతోంది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి.. కానీ, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితి మారుతోంది.. మొన్నటివరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ద్వేషించిన అగ్ర రాజ్య లీడర్లు.. ఇప్పుడు ఆయనే ముద్దు అంటున్నారు.
ఆర్థిక ఆంక్షలు.. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టగానే రష్యా పై అమెరికా సహా పశ్చిమ దేశాలు తక్షణం తీసుకున్న చర్యలివి. ఇవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే రష్యాలో మెక్ డొనాల్డ్స్ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు దుకాణాలు మూసేసేంత. రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను బంద్ చేశాయి. రష్యా సంస్థలు, వ్యక్తులపైనా నిషేధం విధించారు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రష్యా. దీంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ వచ్చీరాగానే ఇరాన్ చమురు ఎగుమతులపై ఫోకస్ పెట్టారు. మున్ముందు ఇంధన ధరలు భగ్గుమంటాయనే ఆందోళనలు నెలకొన్న వేళ రష్యాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందనే కథనాలు వస్తున్నాయి.
పుతిన్ తో ట్రంప్ నకు మొదటినుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. 2016లో ట్రంప్ ను గెలపించిందే పుతిన్ అనే కథనాలు వినిపించాయి. రెండోసారి అధ్యక్షుడు అయ్యాక పుతిన్ పట్ల ట్రంప్ పాత స్నేహాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే ఆంక్షల తొలగింపు అని చెబుతున్నారు. రష్యాతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు అని అంటున్నారు.
ఉక్రెయిన్ కు మిలిటరీ సాయాన్ని నిలిపివేసిన ట్రంప్.. రష్యాను ఆంక్షల నుంచి విముక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ కోసం ఖర్చు చేసే కంటే.. రష్యన్ చమురు, గ్యాస్ ను కొనుగోలుకే యూరప్ దేశాలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయనేది ట్రంప్ అభిప్రాయం.
ఈ పరిస్థితులను చూసే ఏమో..? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధానికి ముగింపు లేనట్లేనని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి సాయం ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో డీల్ కు సిద్ధమని.. ఆ దేశంతో తమ బంధం ఇప్పటిది కాదని వ్యాఖ్యానించారు. తమ ప్రజలు అమెరికాకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.
రష్యా మీద అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే, పశ్చిమ దేశాలూ అదే బాటలో నడుస్తాయి. అటు ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఆపుతుందా? అనేది చెప్పలేం.. మరి మూడేళ్ల విధ్వంసం ఎందుకు?