రష్యా దాడిలో హ్యారీపోటర్ కోట ధ్వంసం?
రష్యా, ఉక్రెయిన్ మద్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు పెరిగాయి.
By: Tupaki Desk | 1 May 2024 9:36 AM GMTరష్యా, ఉక్రెయిన్ మద్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు పెరిగాయి. దీంతో రష్యా క్షిపణి దాడులకు పూనుకుంటోంది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలోని హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యాసంస్థ భవనంపై క్షిపణి దాడి జరిగింది. ఇసికందర్ క్షిపణిపై క్లస్టర్ వార్ హెడ్ ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్లు చెబుతున్నారు. సుమారుగా 20 భవనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. ఓ భవనం అగ్నికీలల్లో చిక్కుకుని మండుతున్న చిత్రాలు అందరిలో ఆశ్చర్యం నింపాయి.
క్రిమియాలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా చెబుతోంది. అమెరికా అందజేసిన ఆయుధాలతో దాడులు జరిగినట్లు రష్యా ఆరోపిస్తోంది. ఖర్కీవ్ నగరంలోని ఓ రైల్వే లైన్ పై రష్యా గైడెడ్ బాంబ్ తో దాడి చేసింది. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరం కావడం గమనార్హం.
దొనెట్స్స్ నుంచి తప్పించుకున్న ఓ 97 ఏళ్ల మహిళ తమ ప్రాంతానికి వచ్చిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఆమెపేరు స్టెపనోవాగా తెలిపింది. ఫిరంగి గుళ్ల దాడికి తప్పించుకుని పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందని పేర్కొంది. ఆమెను సురక్షితంగా కాపాడినట్లు తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా చాలా మంది నిరాశ్రయులుగా మారారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రెండు మూడేళ్లుగా కొనసాగుతోంది. దీంతో ప్రపంచ దేశాన్ని రష్యా చర్యలను ఖండిస్తున్నా అది మాత్రం వినడం లేదు. తాను ఎంచుకున్న మార్గంలోనే వెళ్లాలని చూస్తోంది. రెండు దేశాల మధ్య రోజురోజుకు వైరం పెరుగుతోంది. ఉక్రెయిన్ కూడా ససేమిరా అంటోంది. యుద్ధానికి భయపడేది లేదని చెబుతోంది. రష్యా చర్యలను ఖండిస్తోంది. తమ దేశంపై దాని పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తోంది.