రష్యాకు దబిడ దిబిడే.. ఉక్రెయిన్ కు అమెరికా పవర్ ఫుల్ ఆయుధాలు!
తాజాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ లో పర్యటించిన సందర్భంగా ఆ దేశం నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం.
By: Tupaki Desk | 8 Sep 2023 7:49 AM GMTయూరోపియన్ దేశం ఉక్రెయిన్.. అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి దేశాలకు దగ్గరవుతోందని రష్యా ఆ దేశంపై దాడికి దిగి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటికీ యుద్ధానికి శుభం కార్డు పడలేదు. మొదట్లో తేలిగ్గా లొంగిపోయేలా కనిపించిన ఉక్రెయిన్.. ఇప్పుడు అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో రష్యాపై ధీటుగా పోరాడుతోంది. మరోవైపు మొదట్లో ఉక్రెయిన్ లోని ఒక్కో ప్రాంతాన్ని సులువుగా జయించుకుంటూ ముందుకు వెళ్లిపోయిన రష్యాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 17000 మంది రష్యన్ సైనికులు ఇప్పటివరకు మరణించారని అంటున్నారు. అలాగే భారీ ఎత్తున యుద్ధ విమానాలను, డ్రోన్లను సైతం కోల్పోయిందని చెబుతున్నారు.
కాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. దీంతో యుద్ధం కొత్త రూపును సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ కు డిప్లిటెడ్ యురేనియంతో చేసిన అణు తూటాలను అందించనున్నామని అమెరికా తాజాగా సంచలన ప్రకటన చేసింది.
ఉక్రెయిన్ కు ప్రకటించిన బిలియన్ డాలర్ల సైనిక సాయంలో భాగంగా ఆ దేశానికి అణు తూటాలను అందిస్తున్నట్టు అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ ఆక్రమిత భాగాల నుంచి రష్యా దళాలను పారదోలడానికి వీటిని ఉపయోగించొచ్చని అమెరికా తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ లో పర్యటించిన సందర్భంగా ఆ దేశం నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం.
అమెరికా తాజా సైనిక సాయంలో భాగంగా 120 ఎంఎం యురేనియం ట్యాంక్ తూటాలు, ఎం1 అబ్రమ్ ట్యాంకులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, లాంగ్ రేంజ్ రాకెట్ లాంఛర్లు, శతఘ్ని గుండ్లను ఉక్రెయిన్ కు అందించనుంది.
కాగా అమెరికా అందించే అణు తూటాలను సాయుధ వాహనాలకు ఉండే కవచాలను ఛేదించడానికి ఉపయోగించొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉక్రెయిన్ కు అమెరికా నుంచి 31 ఎం1 అబ్రమ్ ట్యాంకులు అందనున్నాయి. వీటిని వినియోగించేందుకు వీలుగా ఇప్పుడు అణు తూటాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అమెరికా చర్యపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కు అణు తూటాలను అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఉక్రెయిన్ కు ఛాలెంజర్–2 ట్యాంకులు వినియోగించేందుకు వీలుగా బ్రిటన్ ఇప్పటికే యురేనియం తూటాలను అందజేసింది.
కాగా ముడి యురేనియంను శుద్ధిచేసినప్పుడు వచ్చే ఉప ఉత్పత్తిని డిప్లిటెడ్ యురేనియం అంటారు. ఇది భారీ తూటాల తయారీకి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. డిప్లిటెడ్ యురేనియం అమర్చిన తూటాను పేల్చితే ఓ బలమైన ఆయుధం వలే పనిచేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ట్యాంకులకు అమర్చే బలమైన లోహ కవచాలను కూడా చీల్చుకొని ఈ తూటా వెళ్లగలదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా అణు తూటా కొన్ని వందల డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిని అందుకొంటే స్వయంగా మండుతుందని చెబుతున్నారు.
మరోవైపు అమెరికా ఇప్పటికీ ఈ రకం యురేనియంతో ఆయుధాలను తయారుచేస్తోంది. 2003లో ఇరాక్ పై అమెరికా చేపట్టిన యుద్ధంలో దాదాపు 10 వేల రౌండ్ల డిప్లిటెడ్ యురేనియం(డీయూ) తూటాలు వాడినట్లు ది గార్డియన్ పత్రిక అప్పట్లో సంచలన కథనం వెలువరించింది. ఇరాక్ లోని 300 ప్రదేశాల్లో ఈ అణు తూటాల అవశేషాలను గుర్తించారు. వీటి దెబ్బకు ఇరాక్ లోని ఫలూజా నగరంలో హిరోషిమా, నాగసాకీ కంటే అత్యధిక రేడియేషన్ వెలువడింది.