Begin typing your search above and press return to search.

ఊహించని ఘటన... విమానాశ్రయంలో తుపాకులతో ఆందోళనకారులు!

సాధారణంగా విమానాశ్రయాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయి. ఇక్కడ ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకూ తావుండదు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:00 AM GMT
ఊహించని ఘటన... విమానాశ్రయంలో తుపాకులతో ఆందోళనకారులు!
X

సాధారణంగా విమానాశ్రయాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయి. ఇక్కడ ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకూ తావుండదు. అయితే ఊహించని విధంగా తాజాగా ఒక విమానాశ్రయంలోకి ఆందోళనకారులు దూసుకొచ్చారు. అక్కడ ఒక దేశానికి సంబంధించిన విమానం ల్యాండ్ అవ్వగానే దానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

అవును... విమానాశ్రయంలోకి ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఇది రష్యాలో జరిగింది. ఇజ్రాయేల్ నుంచి వచ్చిన విమానం విషయంలో ఇది జరగడం గమనార్హం. రష్యాలోని ఓ విమానాశ్రయంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన విమానం దగెస్థాన్‌ విమానాశ్రయంలో ఆగడంతో అక్కడి నిరసనకారులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఇజ్రాయెల్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... టెల్‌ అవీవ్‌ నుంచి రష్యా రాజధాని మాస్కోకు ఓ విమానం బయలుదేరింది. మధ్యలో దగెస్థాన్‌ లోని విమానాశ్రయంలో ఆగింది. దీంతో... ఆ విమానాన్ని తమ ప్రాంతంలో ల్యాండ్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది పౌరులు దూసుకొచ్చారు. ఇజ్రాయెల్‌ పౌరులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విమానం దిగిన వారిపైకి దూసుకెళ్లారు. లగేజీ తీసుకుంటున్న వారిని చుట్టుముట్టారు.

దీంతో విమనాశ్రయంలో ఒక్కసారిగా ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో బయటకు వెళ్లే మార్గంలో ప్రయాణికుల పాస్‌ పోర్టులను ఆందోళనకారులు తనిఖీ చేశారు. ఆ పాస్ పోర్ట్ ఇజ్రాయేల్ కు చెందినవారిదైతే దాడులు చేశారని తెలుస్తుంది. పైగా ఆ సమయంలో కొంతమంది నిరసనకారుల వద్ద తుపాకీలు ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో సమాచారం అందుకున్న రష్యా అధికారులు భద్రతా దళాలను రంగంలోకి దింపారు. ఇదే సమయంలో... ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించినట్లు రష్యా ఏవియేషన్‌ అథారిటీ రోసావియాట్సియా వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏకంగా నవంబరు 6 వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క తమ దేశంలో వీసా లేకుండానే ఈ పరిస్థితుల్లో పర్యటించొచ్చని ఇజ్రాయేలీయులకు అమెరికా ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని రష్యా అధికారులను ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు కోరారు.