పాతికేళ్లలోపు యువతులు బిడ్డను కంటే రూ.92 వేలు!
తమ తమ దేశాల్లో రోజు రోజుకీ పడిపోతున్న సంతానోత్పత్తి పలు దేశాలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది.
By: Tupaki Desk | 13 July 2024 2:45 AM GMTలేనివాడికి ఆకలి బాధ అయితే.. ఉన్నవాడికి అజీర్తి బాధ అని అంటారు! కొన్ని దేశాలు అధిక జనాభాతో ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని దేశాలు రోజు రోజుకీ పడిపోతున్న జనాభాతో సమస్యలు ఎదుర్కొంటుంటాయి. దీంతో... సరికొత్త ఆలోచనలు చేసి, వివాహిత దంపతులకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి వ్యవహారమే ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తమ తమ దేశాల్లో రోజు రోజుకీ పడిపోతున్న సంతానోత్పత్తి పలు దేశాలకు అతిపెద్ద సమస్యగా మారుతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే కొంతకాలం తర్వాత దేశం నిండా వృద్ధులే ఉంటారని ఆందోళన చెందుతున్నాయి. సరాసరిన ఓ మహిళ ఒక్క బిడ్డకు కూడా జన్మను ఇవ్వడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రష్యా సరికొత్త ఆలోచన చేసింది. ఇప్పుడు ఈ ఆలోచన ఆసక్తిగా మారింది.
అవును... తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా పలు చర్యలు చేపడుతోంది. తాజాగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా... స్థానిక యూనివర్శిటీ, కాలేజీలలో చదివే 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కనుక ప్రసవిస్తే వారికి రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచడానికి రష్యా ఇలాంటి ఆలోచనలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే రష్యా, దాని రీజియన్ ప్రాంతాలు జననాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా దేశంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్ లు, మాత్రలపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలుస్తుంది.
మరోపక్క ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాలోని పలువురు యువకులు మరణించగా.. బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారనే భయంతో చాలా మంది ఇప్పటికే దేశాన్ని వదిలి పారిపోయారని అంటున్నారు. కాగా... ప్రతీ రష్యా మహిళ కనీసం 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది డిసెంబర్ లో పుతిన్ విజ్ఞప్తి చేశాడు.