ముందు వెళ్లేదెవరు? చంద్రయాన్ -2కు పోటీగా రష్యా లూనా25!
కొద్ది రోజుల క్రితం భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో ‘చంద్రయాన్-2’ను ప్రయోగించటం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Aug 2023 4:51 AM GMTకొద్ది రోజుల క్రితం భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో ‘చంద్రయాన్-2’ను ప్రయోగించటం తెలిసిందే. ఇప్పటికే చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన చంద్రయాన్.. తనకు నిర్దేశించిన ప్రాంతంలో ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండ్ కానుంది. ఈ ప్రయోగంలో ప్రత్యేకత ఏమంటే.. ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఎవరూ తమ ల్యాండర్ ను ల్యాండ్ చేయలేదు. చంద్రయాన్ అడుగు పెడితే.. తొలిసారి ఆ ప్రాంతంలో అడుగు పెట్టిన ఘనత భారత్ సొంతం కానుంది. ఇదిలా ఉంటే.. యాభై ఏళ్ల తర్వాత రష్యా తన ల్యాండర్ ను తాజాగా ప్రయోగించిన విషయం తెలిసిందే.
మాస్కోకు తూర్పున 350 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి సోయుజ్ -2 ఫ్రిగట్ రాకెట్ ద్వారా లూనా-25 అనే ల్యాండర్ ను ప్రయోగించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రెండు ల్యాండర్లు ఆగస్టు 23నే చందమామ మీద దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కానున్నాయి. చంద్రయాన్ -2 ఎప్పుడు ల్యాండ్ అవుతుందన్న విషయాన్ని ఇప్పటికే వెల్లడించినప్పటికీ.. రష్యా మాత్రం తన ల్యాండర్ ఏ సమయానికి ల్యాండ్ అవుతుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో.. ఇద్దరిలో ఎవరు మొదట ల్యాండ్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2లో వినియోగించిన సాంకేతికత ప్రకారం రాకెట్ ప్రయోగం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టే ప్రాసెస్ సుదీర్ఘంగా ఉండగా.. రష్యా మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని పాటించటంతో.. భారత్ ప్రయోగించిన ల్యాండర్ అడుగు పెట్టే సమయానికే రష్యా కూడా తన ల్యాండర్ ను ల్యాండ్ అయ్యేలా చేసింది. అయితే.. ఇప్పుడు పోటీ అంతా.. ఎవరు తొలుత చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి అడుగు పెడతారన్నదే ఆసక్తికరంగా మారింది.
మిత్రుల మధ్య మొదలైన ఈ పోటీలో ఎవరిది పైచేయి అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు సాంకేతిక అవసరాలకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి. దీంతో.. పరిమిత వనరుల మధ్యన తాజా అంతరిక్ష ప్రయోగం సాగిందని చెప్పాలి. మిత్రుడు ప్రయోగించిన రాకెట్ విషయంలో భారత్ సానుకూలంగా స్పందించటమే కాదు.. అసలుసిసలైన మిత్రుడిగా వ్యవహరిస్తూ అభినందనలు తెలియజేసింది. మన అంతరిక్ష ప్రయాణాల్లో మనకు మరో మీటింగ్ పాయింట్ ఉండటం అద్భుతం అంటూ చేసిన ప్రకటన చూసినప్పుడు భారత్ విశాల మనసు ఇట్టే అర్థమవుతుంది.