Begin typing your search above and press return to search.

పుతిన్ ను తిడితే..వంట వాడికీ మరణమే..కిటికీలోంచి దూకి ఆత్మహత్య

కానీ, పుతిన్ మాత్రం రెండున్నరేళ్ల కిందటే యుద్ధం మొదలుపెట్టారు. ఇక పుతిన్ పై రాజకీయంగా ఎన్నో విమర్శలున్నాయి

By:  Tupaki Desk   |   14 Nov 2024 10:30 AM GMT
పుతిన్ ను తిడితే..వంట వాడికీ మరణమే..కిటికీలోంచి దూకి ఆత్మహత్య
X

రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటే.. మామూలు మాటలు కాదు.. పైకి ఆయన సాఫ్ట్ గా కనిపించినా, లోపల జరిజినల్ వేరే ఉంటుంది.. ఆయన అంతరంగం ఎవరికీ అంతుచిక్కదు.. చేయాల్సింది చేసేయడమే పుతిన్ నైజం.. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందరూ హెచ్చరించారు. కానీ, పుతిన్ మాత్రం రెండున్నరేళ్ల కిందటే యుద్ధం మొదలుపెట్టారు. ఇక పుతిన్ పై రాజకీయంగా ఎన్నో విమర్శలున్నాయి. ప్రత్యర్థులను అత్యంత కఠినంగా అణచివేస్తారనే ఆరోపణలున్నాయి. ఆఖరికి వారి అంతు చూస్తారనే అపవాదులు ఎదుర్కొన్నారు.. వాటిలో నిజం ఎంతో తెలియదు కానీ.. పుతిన్ ను ఎవరైనా తప్పుబడితే వారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే.. రష్యా ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త పావెల్‌ ఆంటోవ్‌ అయితే భారత పర్యటనలో ఉండగా చనిపోయారు.

నావల్నీని నిర్బంధించి..

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ. ప్రజాదరణ కూడా ఎక్కువే. అలాంటి నావల్నీ అనారోగ్యంతో చనిపోయారు. పుతిన్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టే నావల్నీ.. జైలు పాలై అక్కడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో శిక్షను ఎదుర్కొంటూ మరణించారు. ఇలా నావల్నీ ఒక్కరే కాదు.. రష్యాకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చనిపోయారు. వీర మరణాల తీరు ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఒకప్పటి వంట వాడినీ వదల్లేదు

వాగ్నర్ గ్రూప్.. రష్యాకు చెందిన కిరాయి సేన. ఉక్రెయిన్ పై యుద్ధంలోనూ పాల్గొంది. కానీ, అనూహ్యంగా పుతిన్ పై తిరుగుబాటు చేశాడు వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్. కానీ, అది విజయవంతం కాలేదు. మరికొద్ది నెలల్లోనే అతడు ఘోర విమాన ప్రమాదంలో చనిపోయాడు. ప్రిగోజిన్‌ ను మొదట్లో 'పుతిన్ వంట మనిషి' అనేవారు. అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ లో అధికారిక కార్యక్రమాలకు ఆహారం, పానీయాలు సరఫరా చేసే ప్రిగోజిన్ ఆ తర్వాత పుతిన్ దగ్గరయ్యారు. కానీ.. ఎలా దగ్గరయ్యారో అలానే దూరమయ్యారు.

ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక

నావల్నీ, ప్రిగోజిన్ మాత్రమే కాక.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం మొదలయ్యాక రష్యాకు చెందిన సంపన్నులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు వరుసగా చనిపోయారు. తాజాగా వీరి జాబితాలో చేరాడు చెఫ్‌. అలెక్సీ జిమిన్‌ అనే ఆ చెఫ్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇతడు పుతిన్ పలు అంశాల్లో తీవ్రంగా విమర్శించాడు. ప్రముఖ టెలివిజన్‌ చెఫ్ అయిన జిమిన్.. ఇటీవల తన పుసక్తం ప్రచారం కోసం సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌ వెళ్లి.. అక్కడే హోటల్‌ లో చనిపోయాడు. ఎందుకిలా జరిగిందో పోస్ట్ మార్టం తర్వాత కాని తెలిసే అవకాశం లేదు. జిమిన్‌ రష్యా ఎన్టీవీ మీడియాలో వంటల కార్యక్రమం నిర్వహించేవాడు. 2014లో ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను రష్యా ఆక్రమించడంతో పుతిన్‌ ప్రభుత్వంపై బహిరంగనే విమర్శలు చేసి రష్యా నుంచి వెళ్లిపోయాడు. లండన్‌ లో ‘జీమా’ పేరుతో రెస్టారంట్‌ పెట్టి స్థిరపడ్డాడు. ఎన్టీవీలో కుకరీ షో హోస్ట్‌ గా మాత్రం కొనసాగుతున్నాడు. కాగా, ఉక్రెయిన్‌ పై యుద్ధాన్ని కూడా తప్పుబడుతూ పాటలు పాడి సోషల్ మీడియాలో పెట్టాడు. ‘కుకింగ్‌ విత్‌ అలెక్సీ జిమిన్‌’ షోను రష్యా నిలిపివేసింది. ఉక్రెయిన్ శరణార్థులకు విరాళాలు అందించాడు. పుతిన్ ను విమర్శించి చనిపోయిన వారిలో ఎక్కువమంది కిటికీల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నవారే కావడం గమనార్హం.