‘అక్రమంగా విమానంలో ప్రయాణించొచ్చా’?... ఈమెను అడిగితే తెలుస్తుంది!
తాజాగా ఓ మహిళ బోర్డింగ్ పాస్ లేకుండా అక్రమంగా విమానంలో ప్రయాణించారు.
By: Tupaki Desk | 6 Dec 2024 8:12 AM GMTబస్సుల్లో టిక్కెట్లు లేకుండా ప్రయాణించడం సాధ్యమేనా?... సిటీ బస్సుల్లో ప్రయాణించిన వారిలో కొంతమందికి ఈ అనుభవం ఉందని చెబుతుంటారు! మరి.. ట్రైన్ లో టిక్కెట్ లేకుండా ప్రయాణించొచ్చా?.. ఎవరి అనుభవం మేరకు వారు చెబుతారు! సరే... బోర్డింగ్ పాస్ లేకుండా విమానంలో ప్రయానించొచ్చా?.. 'అసాధ్యం' అనే సమాధానం వస్తే.. ఇది చదవాల్సిందే!
అవును... తాజాగా ఓ మహిళ బోర్డింగ్ పాస్ లేకుండా అక్రమంగా విమానంలో ప్రయాణించారు. మరో విమానానికి సంబంధించిన సిబ్బందితో మాట మాటా కలిపి, కబుర్లు చెబుతూ లోపలికి వెళ్లి, ఆమె ఎక్కాలనుకున్న విమానంలోకి ఎంటరైపోయారు. అయితే... ఆమె వ్యవహారాన్ని సిబ్బంది కనిపెట్టేయడంతో అధికారులు ఎంట్రీ ఇచ్చి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... స్వెట్లానా డాలి (57) అనే రష్యా మహిళ న్యూయార్క్ - పారిస్ విమానంలో దొంగచాటుగా ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆమె డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో పారిస్ కు వెళ్లేందుకు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అయితే... ఆమె వద్ద బోర్డింగ్ పాస్ లేకపోవడంతో భద్రతా సిబ్బంది వెనక్కి పంపించేశారు. అనంతరం ఆమె పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.
ఇందులో భాగంగా.. భద్రతా సిబ్బంది వెనక్కి పంపించేయడంతో.. ఎయిర్ ఐరోపా సిబ్బందితో మాటలు కలిపిన ఆమె.. మరో మార్గంలో పారిస్ కు బయలుదేరే డెల్టా విమానం ఎక్కారు. అయితే... విమానం టెకాఫ్ అయ్యి, గాల్లో ఉన్న సమయంలో ఆమె దొంగచాటుగా ప్రయాణిస్తున్నట్లు సిబ్బంది గుర్తించారంట.
అయితే విమానం గాల్లో ఉండటంతో పారిస్ ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారంట. దీంతో... విమానం పారిస్ లో ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా విమానంలో ప్రయాణించినందుకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారని అంటున్నారు. ఈ కేసులో ఆమెకు ఐదేళ్లు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... ఆమె మరో మార్గం గుండా విమానం వద్దకు వెళ్లడం భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుందని.. భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా... ఆమెకు విమానం ఎక్కినప్పటి నుంచి తరచూ బాత్ రూం కు తిరుగుతూ ఉండటంతో ఆమెకు సీటు లేదన్న విషయాన్ని వెంటనే గుర్తించలేకపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు!