ఈ నిరుపేద దేశాధినేత ఎలా అయ్యాడు?
రష్యా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే విస్తీర్ణంపరంగా అతిపెద్ద దేశం.
By: Tupaki Desk | 8 Oct 2023 1:30 PM GMTరష్యా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే విస్తీర్ణంపరంగా అతిపెద్ద దేశం. అంతేకాకుండా ఆసియా, యూరప్ ఖండాల్లో విస్తరించి ఉన్న దేశం. ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా అమెరికాతో సమానంగా హవా చెలాయించింది.. రష్యా. ప్రస్తుతం ఆ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ ఆ వైభవాన్ని తిరిగి సంతరించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీని వెనుక ఉన్న ఒకే ఒక వ్యక్తి, శక్తి.. ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... అమెరికా ఆధ్వర్యంలోని పాశ్చాత్య దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏడాదిన్నరగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్నప్పటికీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలన్నీ చేష్టలుడిగి చూస్తుండటం తప్ప రష్యాను ఏమీ చేయలేకపోతున్నాయంటే దానికి కారణం.. పుతిన్.
నిరుపేద కుటుంబంలో పుట్టిన పుతిన్ లా కోర్సు పూర్తిచేసి, సోవియట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీలో చిన్న ఉద్యోగంతో కెరియర్ ప్రారంభించి దేశ అధ్యక్షుని హోదాకు చేరుకున్నారు. రష్యా చరిత్రలోనే శక్తిమంతుడైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రష్యాకు పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.
పుతిన్ తాజాగా తన 71 పుట్టిన రోజును జరుపుకున్నారు. రష్యాలోని లెనిన్ గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్ బర్గ్)లో నిరుపేద కుటుంబంలో 1952 అక్టోబర్ 7న పుతిన్ జన్మించారు. ఆయన తండ్రి ఒక కర్మాగారంలో ఒక సాధారణ కార్మికుడిగా పనిచేసేవారు. పుతిన్ తల్లి వీధులను శుభ్రం చేసే ఒక స్వీపర్.
జూడో పైన ఆసక్తితో పుతిన్ తన 12 ఏళ్ల వయసులో దాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. ఇదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. యుద్ధ విద్యల పట్ల ఆయన ఆసక్తి పెంచుకోవడానికి కారణమైంది. పుతిన్ కళాశాలలో చదువుతున్న సమయంలో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరారు. 1991లో ఆ పార్టీ అంతర్ధానమయ్యే వరకు అందులోనే ఉన్నారు.
తన కాలేజీ చదువు పూర్తయ్యాక పుతిన్ నాటి సోవియట్ యూనియన్ గూఢచార సంస్థ.. కేజీబీలో చిన్న ఉద్యోగం సంపాదించారు. తన తెలివితేటలు, శక్తియుక్తులతో కేజీబీలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడంతో 1991లో కేజీబీకి స్వస్తి పలికారు. అదే సంవత్సరం సెయింట్ పీటర్స్ బర్గ్ నగర మేయర్ కార్యాలయంలో విదేశీ సంబంధాల కమిటీలో పుతిన్ పనిచేశారు. ఆ తర్వాత ఆ కమిటీకి అధ్యక్షుడిగా పుతిన్ బాధ్యతలు చేపట్టారు.
1996లో పుతిన్ దేశ రాజధాని మాస్కోకు వెళ్లారు. అప్పటి దేశ అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ కు పరిపాలనలో సాయమందించారు. ఎల్సిన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు వరకు పుతిన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డైరెక్టర్, రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 1999లో కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఎల్సిన్ రాజీనామా తర్వాత పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో పుతిన్ అధికారికంగా రష్యా దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తరువాత పుతిన్ రష్యా దేశ చరిత్రలోనే శక్తివంతమైన నేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. తొలుత 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2012 నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2008 నుండి 2012 వరకు పుతిన్ నాటి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ దగ్గర ప్రధాన మంత్రిగా విధులు నిర్వర్తించారు.
భారత్ అంటే తనకు ఇష్టమని రష్యా అధినేత పుతిన్ పలుమార్లు మన దేశాన్ని సందర్శించారు. భారత్ కు వ్యతిరేకంగా రష్యా గడ్డపైన ఎలాంటి కార్యకలాపాలకు, చర్యలకు వీలుండదని కుండబద్దలు కొట్టిన ఏకైక నేత కూడా పుతినే.