Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఆ ధైర్యం చేస్తున్న రష్యా అధినేత!

అయితే పుతిన్‌ ఈ ఏడాది అక్టోబరులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   30 Aug 2023 10:28 AM GMT
ఎట్టకేలకు ఆ ధైర్యం చేస్తున్న రష్యా అధినేత!
X

అమెరికా ఆద్వర్యంలోని నాటో కూటమికి ఉక్రెయిన్‌ దగ్గరవుతోందని ఆరోపిస్తూ ఆ దేశంపై రష్యా దాడికి దిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర గడిచిపోయినా దానికి ఇంకా ముగింపు పలకలేదు. ఇప్పటికే ఇరు వైపులా భారీ ఎత్తున సైనికులు మరణించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ లో సాధారణ ప్రజలు, చిన్నారులు పెద్ద ఎత్తున యుద్ధోన్మాదానికి బలయ్యారు. పాశ్చాత్య దేశాల మద్దతుతో, వారు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌.. రష్యాపై పోరాటం జరుపుతోంది.

మరోవైపు ఐక్యరాజ్యసమితి తదితర దేశాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉక్రెయిన్‌ పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ పై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) వారెంట్‌ జారీ చేసింది. పుతిన్‌ ను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రష్యా దాటి ఏదైనా దేశానికి వెళ్తే ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాలు తనను అరెస్టు చేసే ప్రమాదం ఉండటంతో పుతిన్‌ రష్యా విడిచి బయట ఎక్కడా కాలుపెట్టడం లేదు.

చివరకు కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సుకు పుతిన్‌ డుమ్మా కొట్టారు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధినేత జిన్‌ పింగ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ అధినేతలు ఇలా హేమాహేమీలు పాల్గొన్నప్పటికీ పుతిన్‌ మాత్రం హాజరు కాలేదు. ఆయనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రి వచ్చారు.

అరెస్టు భయంతోనే పుతిన్‌ సెప్టెంబర్‌ రెండో వారంలో భారత్‌ లో జరిగే గ్రూప్‌ –2 సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. ఈ మేరకు గ్రూప్‌–2 సదస్సు జరిగే ఢిల్లీకి రావడం లేదన్నారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫుతిన్‌ ఫోన్‌ లో మాట్లాడారు. తన తరఫున రష్యా విదేశాంగ మంత్రి వస్తారని తెలిపారు.

అయితే పుతిన్‌ ఈ ఏడాది అక్టోబరులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. బీజింగ్‌ లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

పుతిన్‌ చైనాలో పర్యటిస్తే యుద్ధ నేరాలకు గానూ ఆయనపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన చైనాదే అవుతుంది. ఈ ఏడాది అక్టోబరులో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌.. పుతిన్‌ను ఆహ్వానించారని తెలుస్తోంది. ఇందుకు ఆయన అంగీకరించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పుతిన్‌.. చైనా పర్యటన కోసం రష్యన్‌ అధికారులు ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

కాగా పుతిన్‌.. తన చిరకాల మిత్ర దేశం భారత్‌ లో పర్యటించడానికి మొగ్గు చూపని ఆయన చైనాలో పర్యటనకు అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా ఉక్రెయిన్‌ లో సైనిక చర్య నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ చైనా.. రష్యాకు అండగా నిలబడింది. ఈ క్రమంలోనే చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌ పింగ్‌.. ఈ ఏడాది మార్చిలో రష్యా రాజధానిలో మాస్కోలో పర్యటించారు. ఇందుకు ప్రతిగా పుతిన్‌.. చైనాలో పర్యటించనుండటం ఆసక్తి రేపుతోంది.