మోడీ రిటర్న్ జర్నీ.. ఉక్రెయిన్ మీద 100 డ్రోన్లతో దాడి
ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని మోడీ బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశ రాజధాని కీవ్ తో పాటు పలు చోట్ల రష్యా తన క్షిఫుణులతోనూ.. డ్రోన్లతోనూ దాడులకు దిగింది.
By: Tupaki Desk | 27 Aug 2024 4:11 AM GMTభారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ముగిసిందో లేదో.. ఆ దేశానికి చుక్కలు చూపిస్తోంది రష్యా. ఇరుదేశాల మధ్య శాంతి కోసం తన వంతు సాయం చేస్తానని చెప్పిన మోడీ.. ఇరుపక్షాలకు ఓకే అయితే తాను మధ్యవర్తిత్వాన్ని నడిపేందుకు సిద్ధమని చెప్పటం తెలిసిందే. కట్ చేస్తే.. ఉక్రెయిన్ లో మోడీ ఉన్నంత కాలం ఒక్కసారి కూడా యుద్ధ సైరన్ మోగకపోవటం.. రష్యా నుంచి ఎలాంటి దాడులు లేకుండా.. ప్రశాంతంగా ఉన్న దానికి బదులుగా సోమవారం ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారినట్లు చెబుతున్నారు.
ఉక్రెయిన్ పర్యటన ముగించుకొని మోడీ బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశ రాజధాని కీవ్ తో పాటు పలు చోట్ల రష్యా తన క్షిఫుణులతోనూ.. డ్రోన్లతోనూ దాడులకు దిగింది. దీంతో.. పేలుళ్ల శబ్దాలు కీవ్ లో కొన్ని గంటల పాటు చోటు చేసుకున్నాయి. ఈ దాడులతో పలు భవనాలు దెబ్బ తినటంతో ఆస్తి నష్టమే కాదు ప్రాణనష్టం కూడా వాటిల్లినట్లుగా తెలుస్తోంది. తమ దేశంపై రష్యా వంద క్షిపణులు.. వంద డ్రోన్లతో భీకర దాడికి పాల్పడినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు.
ఈ రెండు దేశాల మధ్య దాడులు మొదలైన తర్వాత జరిగిన అతి పెద్ద దాడుల్లో సోమవారం చోటు చేసుకున్న దాడులు ఒకటిగా పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగినట్లుగా ఉక్రెయిన్ వాపోతోంది. రష్యా దాడుల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుందని.. దీన్ని పునరుద్దరించే పనులు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. రష్యా చర్యల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు జెలెన్ స్కీ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ఉక్రెయిన్ లోని తూర్పు.. దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకొని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లుగా ఉక్రెయిన్ వెల్లడించింది.
రష్యా చేస్తున్న దాడుల్ని సమర్థంగా అడ్డుకునేందుకు వీలుగా యూరోపియన్ దేశాలు సాయం చేయాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. రష్యా క్షిపణులు.. డ్రోన్లను కూల్చేందుకు పొరుగున ఉన్న దేశాలు కలిసికట్టుగా సాయం చేయాలన్నారు. ఇలా జరిగితే.. తమ దేశ పౌరుల్ని రక్షించుకునే వీలుందన్నారు. రెండేళ్లకు పైగా రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. రెండు దేశాలు.. ఒకరిపై ఒకరు దాడులకు తెగ బడుతున్నాయి. ఈ దాడుల వల్ల ఉక్రెయిన్ కు జరిగిన నష్టం భారీగా చెబుతున్నారు.
ఇప్పటికే కొన్ని వేల మంది పౌరుల్ని.. సైనికుల్ని ఆ దేశం కోల్పోయింది. ఇక.. ఆస్తి నష్టం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకవేళ.. యుద్ధం ముగిసినా.. ఆ దేశం కోలుకొని తిరిగి తమ పూర్వ స్థితికి చేరుకోవటానికి కనీసం కొన్ని దశాబ్దాల కాలం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రష్యాలోని కస్క్ రీజియన్ లోని మరో రెండు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చినట్లుగా ఉక్రెయిన్ పేర్కొనటం గమనార్హం. తమ బలగాలు మూడు కిలోమీటర్ల దూరం దూసుకెళ్లినట్లుగా చెప్పారు.
రష్యా దాడుల్ని తీవ్రంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసిన ఉక్రెయిన్.. తమకున్న పరిమిత వనరులతో రష్యా మీద వరుస డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని సరతోవ్.. యూరోస్లావ్ తో సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో 22 డ్రోన్లతో దాడులకు దిగినట్లుగా రష్యా పేర్కొంది. వీటిల్లో 20 డ్రోన్లను తాము కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది. ఇక.. రష్యాలోని సరతోవ్ లోని ఎత్తైన భవనంలోకి ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ దూసుకెళ్లింది. ఇది గతంలో తాలిబన్లు అమెరికా ట్విన్ టవర్ ను ఢీ కొట్టిన తరహాలో ఉంది. కాకుంటే.. డ్రోన్ ను ప్రయోగించిన కారణంగా.. నష్టం పరిమితంగా ఉందంటున్నారు. భవనంలో కొద్ది భాగమే దెబ్బ తిందన్న సమాచారం వెల్లడైంది.