Begin typing your search above and press return to search.

664 రోజులుగా యుద్ధం... అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు !

24 ఫిబ్రవరి 2022న రష్యా - యుక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమైంది! ఈ సమయంలో ఇరుదేశాలూ అవిరామంగా పోరాడుతున్నాయి

By:  Tupaki Desk   |   21 Dec 2023 3:30 AM GMT
664 రోజులుగా యుద్ధం... అధ్యక్షుడు జెలెన్  స్కీ సంచలన వ్యాఖ్యలు !
X

24 ఫిబ్రవరి 2022న రష్యా - యుక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమైంది! ఈ సమయంలో ఇరుదేశాలూ అవిరామంగా పోరాడుతున్నాయి. రాకెట్ ల ప్రయోగాలు, డ్రోన్ ల దాడులు వెరసి ఇప్పటికే ఈ యుద్ధంలో తీవ్ర స్థాయిలో ఆస్తినష్టం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారీగా ప్రాణనష్టం సంభవించాయి. ఇరువైపులా లక్షల మధ్య సైనికులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... సుమారు 664 రోజులుగా సాగుతున్న యుద్ధం విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని తెలిపారు. దీంతో ఈ యుద్ధం ఎప్పుడు ముగిసేది రెండేళ్లు కావొస్తున్నా అస్పష్టంగానే ఉందని అర్ధమవుతుంది. తాజాగా విదేశీ మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా స్పందించిన జెలెన్ స్కీ... రష్యాతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.. వచ్చే ఏడాది ముగుస్తుందా.. అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరని అన్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్‌ ప్రజలే కానీ.. సైనిక కమాండర్లు కానీ.. తమకు మద్దతు తెలుపుతున్న పశ్చిమ దేశాల మిత్రులకు కూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలియదని అన్నారు.

ఈ సందర్భంగా ఈ పోరు ఎప్పుడు ముగుస్తుంది అనే విషయానికి సమాధానం తెలియకపోయినా... ఈ యుద్ధంలో తమ లక్ష్యం నెరవేరే వరకు మాత్రం వెనకడుగు వేయబోయేది లేదని జెలెన్‌ స్కీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో యుద్ధం కోసం సుమారు ఐదు లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను సైన్యంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.

ఇదే సమయంలో తమకు అమెరికా చేస్తున్న సాయంపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ... తమకు వాషింగ్టన్‌ పై పూర్తి విశ్వాసం ఉందని, తమకు ద్రోహం చేయదని భావిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది యూఎస్ లో అధ్యక్ష ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అవి ఉక్రెయిన్‌ పై ప్రతికూల ప్రభావం చూపుతాయని జెలెన్‌ స్కీ అభిప్రాయపడ్డారు.

కాగా... ఇటీవల మాస్కో వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కీలక విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం యుద్ధభూమిలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు చేసిన ప్రకటన చర్చనీయాశంమైంది.