అమెరికాకు భారంగా రష్యా ‘తెల్ల ఏనుగు’
తాను తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకు తడిసి మోపిడవుతోంది.
By: Tupaki Desk | 7 March 2024 12:30 PM GMTఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని దీన్నే అంటారు. రష్యాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిని శిక్షించాలని అగ్ర రాజ్యం అమెరికా తీసుకున్న నిర్ణయం ఆ దేశానికే చుక్కలు చూపిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకు తడిసి మోపిడవుతోంది. నెలకు ఏకంగా దాదాపు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలోకి వెళ్లడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందంటూ ఆ దేశంపై రష్యా దండయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలుపెట్టి రెండేళ్లు దాటినా ఉక్రెయిన్ ఇంకా లొంగిపోలేదు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా.. రష్యాపై పలు ఆంక్షలు విధించింది. రష్యా ప్రభుత్వంలో కీలక నేతలు, ఉన్నతాధికారులు, సైన్యానికి చెందిన అధికారులు, రష్యా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్తలు, సంపన్నులపై ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ తో సన్నిహిత సంబంధాలున్న రష్యన్ సంపన్నుడు సులేమాన్ కెరిమోవ్ కు చెందిన విలాసవంతమైన నౌకను అమెరికా టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 348 అడుగుల పొడవున్న ఈ నౌక పేరు ‘అమాడెయా’.
2022లో ఈ నౌక పసిఫిక్ మహాసముద్ర తీర దేశం ఫిజీలో ఉండగా స్థానిక అధికారులు, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు కలిసి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. çప్రస్తుతం ఇది శాండియాగో తీరంలో నిలిపి ఉంది.
అమాడెయా నౌక యజమాని, బంగారం వ్యాపారి అయిన కెరిమోవ్ నౌక నిర్వహణ ఖర్చుల కోసం ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కెరిమోవ్ కు చెందిన ఈ నౌకను అమ్మేందుకు అనుమతించాలని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తిని కోరారు. దీని నిర్వహణ ఖర్చులు భారీగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. నౌన నిర్వహణ కోసం ఇప్పటివరకు 20 మిలియన్ డాలర్ల వరకు వెచ్చించినట్లు తెలిపారు. సగటున నెలకు 6,00,000 డాలర్లు నిర్వహణ ఖర్చులు, బీమాకు మరో 1.4 లక్షల డాలర్లు చెల్లిస్తున్నట్టు వివరించారు. అంతేకాకుండా ఇతర ఖర్చులకు మరో 1.78 లక్షల డాలర్ల వ్యయం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని విక్రయించేందుకు అనుమతించాలని విన్నవించారు. అమెరికా మార్షల్స్ సర్వీస్ ప్రకారం నౌక విలువ 230 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఇంతలో ఒక ట్విస్టు చోటు చేసుకుంది. ఈ నౌక రష్యా సంపన్నుడు కెరిమోవ్ ది కాదని.. ఈ నౌక తమదేనని ఓ కంపెనీ తెరమీదకొచ్చింది. ఈ నౌకను విక్రయించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జప్తు దర్యాప్తును కొట్టేయాలన్న తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువరించేవరకు విక్రయ నిర్ణయాన్ని ఆపాలని విన్నవించింది. నౌకను తమకు అప్పగిస్తే ఇప్పటివరకు అమెరికా చెల్లించిన నిర్వహణ ఖర్చులను కూడా తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చింది.