Begin typing your search above and press return to search.

అయ్యప్ప భక్తుల నిరసనలతో దిగి వచ్చిన కేరళ సర్కార్

ఏదో చేయాలన్న అనవసర ఆరాటం లేనిపోని తిప్పల్ని తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంది కేరళ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   16 Oct 2024 4:51 AM
అయ్యప్ప భక్తుల నిరసనలతో దిగి వచ్చిన కేరళ సర్కార్
X

ఏదో చేయాలన్న అనవసర ఆరాటం లేనిపోని తిప్పల్ని తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంది కేరళ ప్రభుత్వం. అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో కఠిన నిబంధనను తీసుకొచ్చిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. పినరయి సర్కారు కాస్త తగ్గింది. అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి ముందే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న రూల్ ను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

భక్తుల నుంచి వెల్లువెత్తిన తీవ్ర నిరసనల నేపథ్యంలో తగ్గిన కేరళ సర్కారు.. ఆన్ లైన్ లో నమోదు చేసుకోకున్నా భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. వర్చువల్ నమోదు గురించి తెలియకుండా వచ్చిన వారికీ దర్శనం ఉంటుందన్న ముఖ్యమంత్రి.. ప్రమాదానికి గురైనప్పుడు.. తప్పి పోయినప్పుడు భక్తులను గుర్తించేందుకు ఆన్ లైన్ నమోదు ఉపయోగపడుతుందన్నారు.

ఇదే విధానం తిరుపతిలోనూ అమల్లో ఉందన్న కేరళ ముఖ్యమంత్రి.. గత ఏడాది మాదిరే స్పాట్ బుకింగ్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా అయ్యప్ప భక్తులు దర్శనానికి ఆన్ లైన్ లో మాత్రమే నమోదు చేసే అంశంపై మాత్రం పినరయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.