Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు సబితమ్మ ఒక మెరుపు మెరిపించిందిగా?

స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న వారిని వివరాలు తెలుసుకొని.. తన కారులో వెనుక సీట్లో కూర్చొబెట్టుకొని వెళ్లి.. వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Sep 2023 6:09 AM GMT
ఎన్నాళ్లకు సబితమ్మ ఒక మెరుపు మెరిపించిందిగా?
X

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన సబితా ఇంద్రారెడ్డి.. ఆ తర్వాత కాలంలో పెద్ద ప్రాధాన్యత లేకుండా ఉండిపోయారు. చేవెళ్ల చెల్లెమ్మకు వైఎస్ ప్రభుత్వంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. అందుకు తగ్గట్లే ఆమె నిర్ణయాలు కూడా ఉండేవి. చురుకుగా ఉంటూ.. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో ఆమె పెద్దగా ఫోకస్ అయ్యింది లేదు.

2018 ఎన్నికల్లో విజయం సాధించి.. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) కు వచ్చిన తర్వాత.. మంత్రిమండలిలో చోటు లభించినప్పటికీ.. ఆమె నుంచి ప్రజలు ఆశించినంత పని తీరు ప్రదర్శించలేకపోయారన్న విమర్శ ఉంది. ఒకప్పటి చేవెళ్ల చెల్లెమ్మేనా? అంటూ విస్మయానికి గురయ్యే పరిస్థితి. మొన్నామధ్య వర్షాలు పడిన సందర్భంలో.. స్కూళ్లకు సెలవు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో సెలవును ప్రకటించిన వైనంపైనా ఆమె భారీగా డ్యామేజ్ అయ్యారు.

విద్యా శాఖ మంత్రిగా ఉంటూ.. భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. ఉదయాన్నే సెలవు గురించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆమె.. ముఖ్యమంత్రి అలెర్టు చేసే వరకు ఆమె నిర్ణయం తీసుకోకుండా ఉండటం ఏమిటన్న విమర్శలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి.

ఇలా.. తరచూ ఏదోలా విమర్శలకు కేంద్రంగా నిలిచిన ఆమె.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శించారు. మహేశ్వరం మండలం గొల్లూరు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు వెళుతున్న ఆమె.. రోడ్డు పక్కన నడుచుకుంటున్న ఇద్దరు కవల సోదరీ మణుల్ని చూసి.. తన వాహనాన్ని.. కాన్వాయ్ ను ఆపారు.

స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న వారిని వివరాలు తెలుసుకొని.. తన కారులో వెనుక సీట్లో కూర్చొబెట్టుకొని వెళ్లి.. వారి ఇంటి వద్ద డ్రాప్ చేశారు. పిల్లలతో ప్రయాణించే సమయంలో వారేం చదువుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆమె.. వాళ్లకు కబుర్లు చెప్పారు. తమ ఇల్లు వచ్చేసరికి.. ఇక్కడే మా ఇల్లు అని చెప్పటంతో.. మంత్రి కాన్వాయ్ అక్కడ ఆగటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు.

పిల్లలు వాహనం దిగే సమయంలో తాను తెలుసా? అని అడగటం.. పిల్లలు తెలీదన్నట్లుగా చెప్పటంతో.. తన పేరు సబితమ్మ అంటూ చెప్పుకున్నారు. రాష్ట్ర మంత్రి స్వయంగా తమ పిల్లల్ని కారులో తీసుకొచ్చి డ్రాప్ చేయటంతో పిల్లల తల్లి సంతోషానికి గురి కాగా.. స్థానికులు సబితమ్మ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. ఎన్నాళ్లకు పాత సబితమ్మ కనిపించిందన్న మాట వినిపిస్తోంది.