Begin typing your search above and press return to search.

సబిత తొలిసారి కారు గుర్తుపై

మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలిసారి కారు గుర్తుపై పోటీకి దిగబోతున్నారు

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:29 AM GMT
సబిత తొలిసారి కారు గుర్తుపై
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకేసారి 115 మంది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే పోటీ చేసే అభ్యర్థుల్లో కొన్ని విశేషాలున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, మంత్రులుగా కొనసాగుతున్న కొంతమంది నేతలు.. వచ్చే ఎన్నికల్లో తొలిసారి కారు గుర్తుపై పోటీ చేయబోతున్నారు. అది ఎలా అంటారా? గత ఎన్నికల్లో వేరే పార్టీల తరపున గెలిచిన ఆ నాయకులు తర్వాత బీఆర్ఎస్లో చేరడమే అందుకు కారణం. ఇలాంటి వాళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులున్నారు.

మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలిసారి కారు గుర్తుపై పోటీకి దిగబోతున్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమె.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం మంత్రి అయ్యారు. చేవెళ్ల నుంచి 2000, 2004లో కాంగ్రెస్ నుంచి ఆమె వరుసగా విజయాలు సాధించారు. 2009లో మహేశ్వరానికి మారి విజయ ఢంకా మోగించారు. కానీ 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె.. మళ్లీ 2018లో పోటీచేసి గెలిచారు. మరోవైపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కూడా తొలిసారి కారు గుర్తుపై పోటీ చేయబోతున్నారు. 2018లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి.. అనంతరం బీఆర్ఎస్లో చేరారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టీడీపీ నుంచి విజయం సాధించిన ఇద్దరు, రామగుండం నుంచి ఫార్వర్డ్ బ్లాక్, వైరా నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అనంతర రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్లో చేరిపోయారు. వీళ్లలో ఆత్రం సక్కు, రాములు నాయక్ మినహా మిగతా అందరికీ కేసీఆర్ ఇప్పుడు టికెట్ ఇచ్చారు. దీంతో గండ్ర వెంకట రమణారెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు తదితరులు తొలిసారి కారు గుర్తుపై పోటీకి సిద్ధమవుతున్నారు.