పార్టీ మార్పుపై మాజీ మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 July 2024 5:29 AM GMTతెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై ఆమె స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను పార్టీ మారబోనని.. బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతానని సబితా ఇంద్రారెడ్డి తేల్చిచెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. దయ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలను కోరారు.
తనకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. కాబట్టి పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. అసలు ఆ ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని సబిత స్పష్టం చేశారు.
దీంతో సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారతారనే ప్రచారాలకు అడ్డుకట్ట పడింది. కాగా ఆమె తొలిసారి 2000 సంవత్సరంలో తన భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ విజయం సాధించారు. వైఎస్సార్ కేబినెట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2009లో చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మహేశ్వరం నియోజకవర్గానికి మారి అక్కడ నుంచి విజయం సాధించారు. మరోసారి వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ పనిచేశారు.
2014 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డికి బదులుగా ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తిరిగి 2018లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె బీఆర్‌ఎస్ లో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2023లో ఎన్నికల్లో మహేశ్వరం నుంచి తొలిసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.