Begin typing your search above and press return to search.

యూఎస్ లో భారత సంతతి వ్యక్తిని కాల్చిన పోలీసులు... ఏమి జరిగింది?

నిందితుడు ఉత్తరప్రదేశ్‌ కు చెందిన సచిన్ సాహు (42) గా గుర్తించారు. అమెరికాలోని శాన్ అంటోనియోలో ఈ ఘటన చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   26 April 2024 10:02 AM GMT
యూఎస్  లో భారత సంతతి వ్యక్తిని కాల్చిన పోలీసులు... ఏమి  జరిగింది?
X

అమెరికాలో భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒక మూల ఆందోళన కలిగించేలా దర్శనమిస్తున్నాయనే చర్చలకు మరింత బలం చేకూరుతూనే ఉంది! ఈ సమయంలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులే కాల్చి చంపిన ఘటన తెరపైకి వచ్చింది. దీంతో... ఆ మృతుడు ఎవరు, జరిగిన ఘోరం ఏమిటి, ఈ కాల్పులకు కారణం ఏమిటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి!

అవును... అమెరికాలో భారత సంతతికి చెందిన అనుమానిత వ్యక్తిని పోలీసులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. నిందితుడు ఉత్తరప్రదేశ్‌ కు చెందిన సచిన్ సాహు (42) గా గుర్తించారు. అమెరికాలోని శాన్ అంటోనియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళను కారుతో ఢీకొట్టిన కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన ఇద్దరు అధికారులను సైతం కారుతో ఢీకొట్టడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాళ్లోకి వెళ్తే... ఒక వ్యక్తి మారణాయుధంతో సంచరిస్తున్నట్టుగా ఈ నెల 21న శాన్ అంటోనియో పోలీసులకు సమాచారం అందింది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులకు 51 ఏళ్ల మహిళను సాహు అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కరుతో ఢీకొట్టినట్లు గుర్తించారట! ఆ తర్వాత అతడు అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు ఆ బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు.

అయితే.. విచారణలో.. సాహు ఢీకొట్టిన మహిళ అతని రూమ్ మేట్ అని, బాధితురాలికి సర్జరీలు జరుగుతున్నాయని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసు చీఫ్ బిల్ మెక్‌ మనుస్ తెలిపారు. ఈ నేపథ్యంలో... ఈ కేసులో అనుమానితుడు, పరారీలో ఉన్న నిందితుడి సాహుపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో తిరిగి సంఘటనా స్థలంలో సంచరిస్తున్న సాహుని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా... అతడు ఇద్దరు పోలీసులను తన కారుతో ఢీకొట్టడంతో ఒక అధికారి గాయపడ్డాడట.

దీంతో మరో పోలీసు అధికారి తుపాకీతో కాల్పులు జరపగా, సాహు అక్కడికక్కడే మరణించాడని చెబుతున్నారు. మరోపక్క గాయపడిన అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు... ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదనీ తెలిపారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు.. దీనికి సంబంధించి బాడీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు.