వంద సెంచరీల వీరుడుని పట్టుకున్న ఎలక్షన్ కమిషన్!
భారత ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారానికి నేషనల్ ఐకాన్ గా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నియమితులయ్యారు
By: Tupaki Desk | 23 Aug 2023 9:41 AM GMTటీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. క్రికెట్ గాడ్ గా పేరొందిన వంద సెంచరీల వీరుడు కొత్తగా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. 94.5 కోట్ల ఓటర్లకు ఓటింగ్ పై అవగాహన పెంచే పనికి పూనుకున్నారు!
అవును... భారత ఎన్నికల సంఘం (ఈసీ) ప్రచారానికి నేషనల్ ఐకాన్ గా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓటింగ్ పై అవగాహన పెంచే క్రమంలో ప్రచారకర్తగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం లక్ష్యంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచిన్ సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా.. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకునేలా సచిన్ అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగుపై నిర్లక్ష్యం చూపుతున్నందున వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ విషయాలపై స్పందించిన ఈసీ... సచిన్ ప్రచారంతో రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే సచిన్ కి ఎన్నికల కమిషన్ కు మధ్య ఉన్న ఈ ఒప్పందం మూడేళ్లపాటు అమలులో ఉంటుంది.
ఈ విషయాలపై స్పందించిన సచిన్... "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలి" అంటూ తన కర్తవ్యాన్ని మొదలుపెట్టారు. ఇదే సమయంలో... సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్.
కాగా... 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎం.ఎస్.ధోనీ, అమీర్ ఖాన్, మేరీకోమ్ నేషనల్ ఐకాన్స్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా ఉంటే... 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలపుడు నమోదైన ఓటర్ల (17.32 కోట్లు) తో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య అయిదారు రెట్లు పెరిగిందని ఈసీ తెలిపింది. ఇందులో భాగంగా... 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 94.50 కోట్ల మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది!