విషాదం: 'సుహారా' సుబ్రతా రాయ్ ఇకలేరు!
సహారా గ్రూప్ వ్యవహారం మిగిలిన సంస్థలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది. సుబ్రతా రాయ్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని వైద్యులు.. సదరు సంస్థ ప్రతినిధులు ధ్రువీకరించారు
By: Tupaki Desk | 15 Nov 2023 4:48 AM GMTఒక చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగిగా చేరి.. ఆ తర్వాత సదరు సంస్థను సొంతం చేసుకోవటమే కాదు.. దేశంలోనే రైల్వేల తర్వాత అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా రూపొందించిన ఘనత సహారా గ్రూప్ సంస్థల అధిపతి సుబ్రతా రాయ్ సొంతం. గడిచిన కొద్దికాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న 75 ఏళ్ల ఆయన.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జీవితంలో ఆటుపోట్లతో పాటు.. పెను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన కన్నుమూతతో దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో ఒక శకం ముగిసినట్లుగా చెప్పాలి.
సహారా గ్రూప్ వ్యవహారం మిగిలిన సంస్థలకు కాస్తంత భిన్నంగా ఉంటుంది. సుబ్రతా రాయ్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని వైద్యులు.. సదరు సంస్థ ప్రతినిధులు ధ్రువీకరించారు. సాదాసీదా ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి.. ఫైనాన్స్.. రియల్ ఎస్టేట్.. మీడియా.. అతిధ్య రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారు. ఒకదశలో యావద్దేశంతో కార్పొరేట్ సెలబ్రిటీగా పేరొందటమే కాదు.. తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా.. రక్షకుడిగా ఆయన నిలిచేవారన్న పేరుంది.
కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించటం.. ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అంత్యక్రియల కోసం సుబ్రతా రాయ్ భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు తీసుకురానున్నారు. ఆయన మరణం పట్ల పలువురు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1948 జూన్ 10న బిహార్ లో పుట్టిన సుబ్రతా.. గోరఖ్ పూర్ లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత పలు వ్యాపారాలు నిర్వహించారు. 1976లో చిట్ ఫండ్ లో చేరి.. ఆ తర్వాత కాలంలో ఆ సంస్థనే సొంతం చేసుకున్న ఆయన.. 1978లో సదరు చిట్ ఫండ్ కంపెనీని సహారా ఇండియా పరివార్ గా మార్చేశారు. అనంతరం అనేక వ్యాపారాల్ని ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టిన వేళ.. ఆయన ప్రకటించిన వెంచర్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి.
1992లో రాష్ట్రీయ పరివార్ పేరుతో ఒక దినపత్రికను.. అనంతరం సహారా టీవీ చానల్ తో పాటు పలు వ్యాపారాల్ని చేపట్టారు. తొలుత సహారా టీవీ చానల్ స్టార్ట్ చేసి దాన్ని తర్వాతి కాలంలో సహారా వన్ గా మార్చటం తెలిసిందే. 2000లో సహారా ఇండియా పరివార్ సంస్థలో 12 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. అప్పట్లో దేశంలోని రైల్వేల తర్వాత అంత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారాకు పేరుంది.
2010లో లండన్ లోని గ్రోస్ వెనర్ హౌస్ హోటల్ ను కొనుగోలు చేయటం.. 2012లో న్యూయార్క్ లోని ప్లాజా హోటల్ ను కొనటం ద్వారా అంతర్జాతీయంగా వార్తల్లోకి వచ్చారు. అనంతరం.. ఆర్థిక మోసాలకు పాల్పడిందంటూ సహారా సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవటంతో తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంది. అయినప్పటికీ కిందా మీదా పడినా నిలదొక్కుకున్నప్పటికీ 2000 ఆరంభంలో వెలిగిన వెలుగులు మాత్రం తర్వాతి కాలంలో కొనసాగించలేకపోయిందని చెప్పాలి.