దాడి తర్వాత సైఫ్ అతడిని బాత్రూంలో బంధించాడట... షాకింగ్ అప్ డేట్స్!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2025 4:46 PM GMTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ మంగళవారం విడుదలయ్యారు. మరోపక్క ఇప్పటికే పట్టుబడిన నిందితుడిని కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... సైఫ్ పై దాడి కేసులో షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అనే వ్యక్తిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా క్రైమ్ సీన్ రీ-క్రియేషన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అతడు సైఫ్ ఇంట్లోకి ఎలా వెళ్లాడు.. ఏమి జరిగింది.. ఎలా బయటకు వచ్చాడనేది క్లియర్ గా విమరించినట్లు చెబుతున్నారు.
అవును... సైఫ్ పై దాడి కేసులో అరెస్టైన నిందితుడిని విచారణలో భాగంగా పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బాంద్రాలోని సైఫ్ ఇంటికి తీసుకెళ్లి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన నిందితుడు.. తొలుత అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డులు నిద్రిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపాడని అంటున్నారు.
దీంతో.. బిల్డింగ్ కాంపౌండ్ వాల్ దూకి ఇంట్లోకి ప్రవేశించి.. అనంతరం వెనుక మెట్లు ఎక్కి ఎయిర్ కండిషనింగ్ డక్ట్ సాయంతో నటుడి ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ సమయంలో చప్పుడు కాకుండా ఉండేందుకు చెప్పులు తీసి సంచిలో పెట్టుకుని, సెల్ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసుకుని.. లోపలికి వెళ్లినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఈ సమయంలో దాడి అనంతరం సైఫ్ అలీఖాన్ తనను బాత్రూం లో బంధించాడని నిందితుడు చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయం వైరల్ గా మారింది. అయితే.. తనను బాత్ రూంలో బందించినప్పటికీ ఎయిర్ కండిషనింగ్ డక్ట్ సాయంతో ఆ గది నుంచి బయటపడినట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం సంచలనంగా మారింది.
ఆ విధంగా బయటపడిన నిందితుడు.. దాడి అనంతరం తనకోసం పోలీసులు గాలిస్తున్నారని గ్రహించి కోల్ కతాలోని హావ్ డా వెళ్లి అక్కడ నుంచి బంగ్లాదేశ్ పారిపోవాలని భావించాడని.. దీనికోసం పలువురు ట్రావెల్ ఏజెంట్స్ ని సంప్రదించగా వారు పెద్ద మొత్తంలో డబ్బులు అడగడంతో వాటిని చెల్లించలేకపోయాడని తెలిపారు.
ఏది ఏమైనా... అంత తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా సైఫ్ ఆ నిందితుడిని ఒడిసిపట్టుకోవడం, బాత్ రూం లో బంధించడం గొప్ప విషయమని అంటున్నారు. అయితే.. అతడు అక్కడ నుంచి కూడా ఏసీ డక్ట్ సాయంతో బయటకు రావడం గమనార్హం!