సైఫ్ దాడి కేసు: అగంతకుడు అలా దొరికిపోయాడు
నిందితుడు చేసిన ఒకే ఒక్క తప్పిదం.. అతడు తనతోపాటే సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడం.
By: Tupaki Desk | 21 Jan 2025 6:55 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసి ఆరు కత్తిపోట్లు పొడిచిన అగంతకుడు పోలీసులకు ఎలా చిక్కాడు? దాదాపు 70 గంటల వేట తర్వాత అతడు థానేలోని నిర్జన ప్రదేశంలో పొదల్లో నిదురిస్తూ పట్టుబడ్డాడు. అయితే అతడిని పోలీసులు ఎలా కనుగొన్నారు? అంటే.. నిందితుడు చేసిన ఒకే ఒక్క తప్పిదం.. అతడు తనతోపాటే సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడం. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతడిని వెంబడించారు. పైగా అతడు హోటల్ లో సెల్ ఫోన్ యాప్ ద్వారా బిల్ చెల్లించడం.. రోడ్ కూడళ్లలో సీసీ కెమెరాలకు చిక్కడం ద్వారా తనను తానే పోలీసులకు అర్పించుకున్నాడని తేలింది.
నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను ఆదివారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షరీపుల్ ఇస్లాం గూగుల్ పే లావాదేవీ ద్వారా అల్పాహారం - పరాఠా కోసం డబ్బు చెల్లించాడు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ చెల్లింపు చేయడం అతడికి తొలి ముప్పు. అతడు ఒక రెస్టారెంట్ లో పనివాడు కాబట్టి సహచరులను ఎంక్వయిరీ చేయగా కొన్ని వివరాలు తెలిసాయి. అయితే అతడి పేరును మీడియాలు కన్ఫ్యూజ్ చేసాయి. మొహమ్మద్ ఇస్లాంగా పేర్కొన్నాయి. కానీ విచారణలో షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అని పూర్తి పేరు తెలిసింది.
నిందితుడు ఘటనా స్థలం నుండి మొదట దాదర్‌కు, ఆపై థానేకు పారిపోయాడు. దాడి జరిగిన ప్రదేశం బాంద్రా నుండి దాదర్‌కు, అటుపై వర్లికి, ఆపై అంధేరీకి, తర్వాత తిరిగి దాదర్‌కు అతడు ప్రయాణించాడు. అటూ ఇటూ తిరుగుతూ కొన్ని గంటల పాటు పోలీసుల నుండి తప్పించుకోగలిగాడు. చివరికి థానే ప్రాంతంలోని నిర్జన రహదారి పక్కన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా సినిమాలో పోలీసుల వేటలా సాగింది. రోడ్డు పక్కన ఉన్న ఒక పొదల్లో అతడిని పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేసారు.
అసలు నిందితుడు దాడి ఎలా చేసాడు?
సైఫ్ పై దాడి కోసం షెహజాద్ తెలివిగా ప్లాన్ చేసాడు. అతడు ఉండే భవంతి ప్రక్కనే ఉన్న మరో భవనం కాంపౌండ్ గోడను దాటి వెనుక మెట్ల ద్వారా నిందితుడు షెహజాద్ ఇస్లాం మొహమ్మద్ లోపలికి చొరబడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. తనను గుర్తించకుండా ఉండటానికి ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లను ఉపయోగించానని అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. సైఫ్ ఉంటున్న భవంతిలో ఏడవ లేదా ఎనిమిదవ అంతస్తు వరకు మెట్లు ఎక్కి, ఆపై డక్ట్‌లలోకి ప్రవేశించి 12వ అంతస్తుకు ఎక్కి బాత్రూమ్ కిటికీ ద్వారా జేహ్ (సైఫ్ కుమారుడు) ఉంటున్న ఫ్లాట్‌లోకి ప్రవేశించాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే సిబ్బంది అతడిని గుర్తించి కేకలు వేయగా, ఇది దాడికి దారితీసింది. అటుపై గొలుసు సంఘటనలు జరిగాయి.
నిందితుడు వేట కోసం క్రైమ్ బ్రాంచీ 30 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్కటి వేర్వేరు ఆధారాలు , దర్యాప్తు మార్గాలను అనుసరించాయి. సైఫ్ అలీ ఖాన్ భవనం నుండి వచ్చిన ఫుటేజ్‌లను స్కాన్ చేసాక వేట మొదలైంది. వాస్తవానికి, బాంద్రా వెస్ట్ నుండి దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న అంధేరిలోని డిఎన్ నగర్‌లో సిసిటివి ఫుటేజ్‌లో పోలీసులు మొహమ్మద్ ఇస్లాం ని గుర్తించడం పెద్దగా సహకరించింది. అతడు ద్విచక్ర వాహనంపై కనిపించాడు. ఇది పోలీసులకు అతనిని ట్రాక్ చేయడానికి మరొక రూట్ ని క్లియర్ చేసింది.
పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం షెహజాద్ దాడి జరిగిన రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రా ప్రాంతంలోని బస్ స్టాప్‌లో ఉన్నాడు. అంటే దాదాపు 5 గంటలు అదే చోట ఉన్నాడు. ఆ తర్వాత అతడు వర్లికి రైలులో ప్రయాణించాడు. పోలీసులు కొంతకాలం అతని ఫోన్ సిగ్నల్‌ను కూడా పట్టుకున్నారు. కానీ అతడు సెల్ ని స్విచ్ఛాఫ్ చేయడంతో రూట్ తెలియలేదు. టీవీ వార్తల బులెటిన్‌లలో తన ఫోటోను చూసిన తర్వాత తాను భయపడ్డానని అతడు పట్టుబడిన అనంతరం పోలీసులకు చెప్పాడు. చివరిగా నిందితుడు ఫోన్ రికార్డ్ ప్రకారం.. లొకేషన్ థానే నుండి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో షెహజాద్ తనకు తెలియకుండానే స్టార్ హీరో సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. తాను ఒక బాలీవుడ్ స్టార్ ఇంట్లో ఉన్నానని తనకు తెలియదని షెహజాద్ పోలీసులకు చెప్పాడు. కత్తిపోట్లు పొడిచాక నిందితుడు పారిపోయాడు. దారిలో అతని రక్తపు మరకలున్న బట్టలు మార్చుకున్నాడు. షెహజాద్‌ను ఇప్పుడు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు. ఈ విచారణలో సైఫ్ ఇంట్లో అతడి సహచరులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అని కూడా పోలీసులు ప్రశ్నించారు.
షెహజాద్ తరపున వాదించిన న్యాయవాది ఆరోపణలు అబద్ధమని, ఈ గొడవలో ఒక ప్రముఖ వ్యక్తి ప్రమేయం ఉన్నందున తన క్లయింట్‌ను బలిపశువును చేస్తున్నారని వాదించారు. నిందితుడి నుండి ఏమీ స్వాధీనం చేసుకోలేదు. అతడు బంగ్లాదేశ్ జాతీయుడని నిరూపించడానికి ఎటువంటి పత్రాన్ని సమర్పించలేదు అని షెహజాద్ తరపు న్యాయవాది వాదించారు. అయితే నిందితుడు స్వయంగా పోలీసులకు.. అవును, నేనే ఈ దాడి చేసాను! అని చెప్పినట్లు పోలీసులు కోర్టులో వాదించారు.