Begin typing your search above and press return to search.

సైఫ్ పై దాడి కేసు... నిందితుడిని పోలీసులు ఎలా ట్రాక్ చేశారంటే..?

బంగ్లాదేశ్ జాతీయుడిగా చెబుతున్న షరీపుల్ ఇస్లాం షెహజాద్ (30) సుమారు ఐదారు నెలల క్రితమే అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి.. బిజోయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ అనే పేర్లు మార్చుకుని జీవిస్తున్నాడని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   19 Jan 2025 2:30 PM GMT
సైఫ్ పై దాడి కేసు... నిందితుడిని పోలీసులు ఎలా ట్రాక్ చేశారంటే..?
X

ఈ నెల 16న తెల్లవారుజామున తన నివాసంలో నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడగా.. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించి తాజాగా అసలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడిని ఎలా ట్రాక్ చేశారనేది ఆసక్తిగా మారింది.

అవును... బంగ్లాదేశ్ జాతీయుడిగా చెబుతున్న షరీపుల్ ఇస్లాం షెహజాద్ (30) సుమారు ఐదారు నెలల క్రితమే అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి.. బిజోయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ అనే పేర్లు మార్చుకుని జీవిస్తున్నాడని చెబుతున్నారు. ఇతడు ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో లేబర్ గా పనిచేస్తున్నాడని అంటున్నారు. ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రాక్ చేసింది ఇలా!:

కుటుంబంతో కలిసి నటుడు సైఫ్ అలీఖాన్ నివసిస్తున్న బాంద్రాలోని భవనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని తొలుత పోలీసులు పరిశీలించారని.. ఈ సమయంలో నిందితుడు అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించారని.. ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకీ కోసం నగరంలోని అన్ని చోట్లా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని స్కాన్ చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలో.. అంధేరీలోని డీఎన్ నగర్ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మరోసారి నిందితుడికి సంబంధించిన దృశ్యాలు కనిపించాయని.. ఇందులో భాగంగా... అనుమానితుడిగా అనిపిస్తున్న వ్యక్తి బైక్ పై నుంచి దిగడం గమనించిన పోలీసులు.. ఆ టూవీలర్ నెంబర్ తో ట్రాక్ చేయడం మొదలుపెట్టారని అంటున్నారు.

ఈ క్రమంలో.. వర్ల్ లోని కోలివాడలో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి అద్దెకు ఉంటున్నాడని తెలుసుకున్న పోలీసులు.. అతడు ఆ వసతి గృహంలో మరో ముగ్గురితో జీవిస్తున్నట్లు గుర్తించారని అంటున్నారు. అతడి మొబైల్ ఫోన్ నెంబర్ ను కూడా సంపాదించారు. ఈ సన్మయంలో అతడు నివసించిన ప్రాంతాన్ని, ఇంటిని పరిశీలించారు.

ఈ సమయంలోనే నిందితుడు థానేలోని రహదరి గుట్టల్లో దాక్కున్నట్లు సమాచారం అందిందని అంటున్నారు. దీంతో... ఆ నిర్జన ప్రదేశాన్ని పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో... సైఫ్ పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు కన్ ఫాం చేశారు!

నిందితుడికి పోలీస్ కస్టడీ!:

సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో అరెస్టు చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను పోలీసులు.. బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈ సమయంలో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో.. నిందితుడిని బాంధ్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నిందితుడి తరుపు లాయర్ల వాదన ఇదే!:

ప్రాథమిక విచారణలో నిందితుడిని బంగ్లాదేశ్ జాతీయుడిగా గుర్తించామని.. అతడు సుమారు ఐదారు నెలల క్రితం భారత్ లోకి ప్రవేశించాడని.. ఈ క్రమంలో ముంబైకి చేరుకుని తన పేరును బిజయ్ దాస్ గా మార్చుకున్నాడని.. ఇతడు భారతీయుడు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు.

అయితే.. నిందితుడి తరుపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ.. మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్ జాతీయుడని అనడానికి పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవని అన్నారు. ఇదే సమయంలో... పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని ఆరోపించారు. అతడు ఆరు నెలల క్రితమే ముంబైకి వచ్చాడనేది వాస్తవం కాదని తెలిపారు!

అతడు సుమారు 7 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చాడని.. అతడి కుటుంబ సభ్యులు కూడా ముంబైలోనే నివశిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు వినిపించినట్లు వెల్లడించారు.