సైఫ్ కేసు కోసం థర్టీ టీమ్స్... మధ్యప్రదేశ్ లో దొరికింది ఎవరు?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అతని ఇంట్లో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jan 2025 12:04 PM GMTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై అతని ఇంట్లో జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్ మెంట్ లోనూ వెల్లడైంది. మరోపక్క సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అవును... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టడానికి 30 టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఘటన జరిగి 50 గంటలు దాటినా ఇప్పటికీ నిందితుడిని పట్టుకోలేకపోయారనే కామెంట్లూ పెరుగుతున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో... రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పనిచేసి వెళ్లిన కార్పెంటర్ వారిస్ అలీ సల్మానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి.. అనంతరం విడిచి పెట్టారు. అతడికి సైఫ్ పై జరిగిన దాడికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అతడిని ముంబై పోలీసులు విచారిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముంబై నుంచి మధ్యప్రదేశ్ కి వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఇతడిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే... నిజంగా ఇతడే నిందితుడా.. లేక, కేవలం అనుమానితుడా అనేదీ తెలియాల్సి ఉంది. దీనిపై బాంద్రా పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు సైఫ్ పై దాడిచేసినట్లు అనుమనిస్తున్న వ్యక్తి ముంబై వీధుల్లోనే పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. దాడి జరిగిన రోజు.. నిందితుడి ఫోటోలను పోలీసులు తొలుత మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లు కనిపించాడు.
ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో విడుదల చేసిన సీసీ ఫుటేజీల్లో బ్లూ షర్ట్ లో కనిపించగా.. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో అతడు పసుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు కనిపించాడు. ఇవి బాంద్రా రైల్వే స్టేషన్ లోని ఫుటేజ్ లోని దృశ్యాలు అని అంటున్నారు. దీంతో... నిందితుడు ముంబై వీధుల్లోనే ఉన్నాడనే చర్చ మొదలైంది.
మరోవైపు.. అతడు స్టేషన్ లో రైలెక్కి నగరంలోని మరో చోటుకి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్స్ లోనూ నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే పోలీస్ సహకారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.