ఆటో డ్రైవర్ తో సైఫ్ ఆత్మీయ ఆలింగనం.. భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అతడిని కలిశాడు సైఫ్ అలీఖాన్.
By: Tupaki Desk | 22 Jan 2025 11:16 AM GMTబాంద్రాలోని తన నివాసంలో దుండగుడితో జరిగిన పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అసలు ఆ రోజు తెల్లవారుజామున తాను ఆస్పత్రికి వెళ్లడంలో సాయం చేసిన ఆటోడ్రైవర్ ను కలిశారు. తాజాగా దీనికి సంబంధించిన పిక్ బయటకు వచ్చింది.
అవును... జనవరి 16 తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో సైఫ్ నివాసంలో అతనిపై దాడి చోటు చేసుకోగా.. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన చిన్న కుమారుడు, మరో సిబ్బందితో రోడ్డు వద్దకు వచ్చిన సైఫ్.. ఓ ఆటోలో లీలావతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో సైఫ్ అలీఖాన్ ను తీసుకెళ్లింది ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణా.
ఈ సమయంలో తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు అతడిని కలిశాడు సైఫ్ అలీఖాన్. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ భజన్ సింగ్ ను సైఫ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంత క్లిష్టమైన సమయంలో తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా డ్రైవర్ ను గుర్తుపెట్టుకుని మరీ కృతజ్ఞతలు తెలపడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా... అసలు ఆరోజు సైఫ్ రోడ్డుపైకి వచ్చినప్పటి నుంచి ఏమి జరిగిందనే విషయాలను ఇప్పటికే మీడియా ఇంటర్వ్యూలో భజన్ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆరోజు తెల్లవారుజామున ఖరీదైన ఇంటి గేటు ఎదుటనిల్చొని ఓ మహిళ సాయం కోసం చూడటం కనిపించిందని.. అటుగా వెళ్తున్న తన ఆటోను ఆపమని కోరిందని తెలిపాడు.
ఆ సమయంలో.. తన ఆటోలో ఎక్కిన వ్యక్తి సైఫ్ అని తాను గ్రహించలేదని.. ఆ సమయంలో ఆయనతో పాటు చిన్న పిల్లాడు, మరో వ్యక్తి ఆటోలో ఎక్కారని.. ఆ తర్వాత తన ఆటోలో ఉన్నది సైఫ్ అని గుర్తించినట్లు తెల్లిపాడు. ఆటో ఎక్కగానే.. ఇంకెంత సమయం పడుతుంది అని మాత్రమే సైఫ్ అడిగారని.. 10 నిమిషాల్లోనే తాము ఆస్పత్రికి చేరుకున్నామని చెప్పాడు.
ఆ సమయంలో సైఫ్ ధరించిన తెల్ల కుర్తా కాస్తా రక్తంతో తడిచి ఎరుపురంగులోకి మారిపోయిందని.. ఆస్పత్రి వద్ద దించిన తర్వాత తాను రూపాయి కూడా తీసుకోలేదని.. అంత క్లిష్ట సమయంలో ఆయనకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించానని చెప్పాడు.