ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్... తెరపైకి రెండు షాకింగ్ విషయాలు!
దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ చికిత్స అనంతరం ఆరో రోజు మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
By: Tupaki Desk | 22 Jan 2025 7:19 AM GMTముంబైలోని బాంద్రాలోగల తన నివాసంలో ఇంట్లోకి చొరబడిన దొంగ జరిపిన దాడిలో ఈ నెల 16 తెల్లవారుజామున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం అతడికి లీలావతీ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఈ సమయంలో శస్త్ర చికిత్స చేశారు. వెన్నులోకి దిగిన కత్తి ముక్కను తొలగించారు.
బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) అనే వ్యక్తి చేసిన ఈ దాడిలో సైఫ్ కు ఆరు చోట్ల గాయాలు అవ్వగా.. అందులో మూడు తీవ్రమైన గాయాలనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చేరిన ఆరో రోజు సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలో ఫిట్ నెస్ పై సందేహాలు తెరపైకి వచ్చాయి.
అవును... దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ చికిత్స అనంతరం ఆరో రోజు మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన శిండే శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ కొన్ని సందేహాలు వ్యక్తపరిచారు. అటు సైఫ్ ఫిట్ నెస్ పైనా.. అటు పోలీసుల తీరుపైనా పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి వైరల్ గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన... 2.5 అంగుళాల కత్తి సైఫ్ కి గుచ్చుకుంది.. అతనికి ఆపరేషన్ జరిగింది.. కాని నాలుగు రోజుల తర్వాత అతడు ఆస్పత్రి నుంచి బయలుదేరి, ఏమీ పట్టనట్లు దూకుడుగా నడుచుకుంటూ కనిపించాడు.. ఇంత త్వరగా కోలుకోవడం సాధ్యమేనా? అని సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు.
ఇదే సమయంలో... సైఫ్ రక్తంతో తడిసిన పరిస్థితిలో ఆస్పత్రికి చేరినట్లు చెబుతున్నారని.. అలాంటప్పుడు సైఫ్ ఆస్పత్రికి వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది.. ఆ పరిస్థితుల్లో తన మైనర్ కుమారుడు సైఫ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగలడా.. సైఫ్ ఇంట్లో అంతమంది సిబ్బంది ఉన్నా ఇంత పెద్ద దాడి ఎలా జరిగింది..? వంటి ప్రశ్నలు లేవనెత్తారు.
మరోపక్క ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరును సంజయ్ నిరుపమ్ విమర్శించారు. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు వేర్వేరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని.. ఈ సమయంలో పోలీసుల తీరు అనుమానాలు రేకెత్తిస్తోందని.. దీని వెనుక పెద్ద కుంట్ర ఉందో లేదో చూడాలని.. ఈ విషయంపై వారి నుంచి మరింత స్పష్టత అవసరమని అన్నారు.
సైఫ్ ఇంట్లో నిద్రపోయిన సెక్యూరిటీ!:
సైఫ్ పై దాడి కేసుకు సంబంధించి పోలీసు విచారణలో నిందితుడు అమీన్ ఫకీర్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. అది సైఫ్ ఇళ్లు అని తెలియకుండానే వెళ్లినట్లు చెప్పారని పోలీసులు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... సైఫ్ తనను గట్టిగా పట్టుకోవడంతో.. ఆ పట్టు విడిపించుకునేందుకే ఆయన వెన్నులో కత్తితో పొడిచినట్లు చెప్పారని పోలీసులు చెబుతున్నారు.
అమీన్ ఫకీర్ తో పోలీసు సీన్ రీక్రియేషన్ చేసినప్పుడు మరిన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇంట్లోకి ఎంటరయ్యే ముందు తన షూ తీసేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేసి వెళ్లినట్లు చెప్పిన అమీన్ ఫకీర్... కారిడార్ లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారని చెప్పడం గమనార్హం. అయితే తనను ఫస్ట్ చూసిన పని మనిషి కేకలు వేయడంతో సైఫ్ వచ్చారని తెలిపాడని అంటున్నారు.