Begin typing your search above and press return to search.

బాబు విడుదల కోసం ఉరితాళ్ల ఫోజులు ఎందుకు? ఉరి వేసుకుంటే సరి!

విలువైన ప్రాణం పోతుందంటే.. సంబంధం లేని వ్యక్తి విషయంలోనూ అయ్యో పాపం అనుకోవటమే కాదు.. వీలైనంతవరకు రక్షించే తత్త్వం అందరిలోనూ ఉంటుంది

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:10 AM GMT
బాబు విడుదల కోసం ఉరితాళ్ల ఫోజులు ఎందుకు? ఉరి వేసుకుంటే సరి!
X

విలువైన ప్రాణం పోతుందంటే.. సంబంధం లేని వ్యక్తి విషయంలోనూ అయ్యో పాపం అనుకోవటమే కాదు.. వీలైనంతవరకు రక్షించే తత్త్వం అందరిలోనూ ఉంటుంది. ఏపీలోని రాజకీయం.. దాని తీరుపుణ్యమా అని మనుషుల తీరు.. వారి మాటలే కాదు.. వారి నడవడికను సైతం ప్రభావితం చేస్తోంది. సామాన్యుల్లోనే కాదు.. సీనియర్ నేతలు సైతం ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలాంటి మాటలు నెగిటివిటి పెంచేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయుడు. వైఎస్ ను ఆయన ఫ్యామిలీని అమితంగా ఆరాధించే ఆయన.. అప్పుడప్పుడు హద్దులు దాటేలా మాట్లాడటం.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేందుకు వెనుకాడని తెగింపు ధోరణిని ప్రదర్శిస్తారని చెబుతారు. స్కిల్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లిన చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసనలపై స్పందించారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు విడుదల కోసం టీడీపీ నేతలు గుండు గీయించుకున్నారని.. పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారన్న ఆయన.. ‘‘ఉరితాళ్లు మెడకు బిగించుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. అదేదో నిజంగానే ఉరేసుకుంటే సరిపోతుంది కదా?’’ అని ప్రశ్నించారు. అదోనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలంటే కనీసం రెండు.. మూడు నెలలు పడుతుందన్న ఆయన.. చంద్రబాబు కోసం దీక్షలు చేస్తున్న వారిని ప్రజలు అస్సలు పట్టించుకోవటం లేదన్నారు.

ఆదోని పోలీసు అధికారులు ఎవరూ.. బూటు కాలితో తన్నే వైఖరిని ప్రదర్శించరని.. వారిపై టీడీపీ నేత భాస్కర్ రెడ్డి చేసే ఆరోపణలన్ని అబద్దాలన్న సాయి ప్రసాద్ రెడ్డి.. పశువులకు ముఖ్యమంత్రి.. మంత్రుల ఫోటోలు పెట్టి సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి.. మంత్రులను తక్కువ చేసేలా పనులను ప్రభుత్వం ఉపేక్షించదని.. అనుమతులు లేకుండా ఊరేగింపులు జరిపితే కేసులు కట్టకుండా ఉంటామా? అన్న ఆయన.. తాము కూడా పోలీసుల అనుమతి తీసుకొని ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు.. ఇతర కార్యక్రమాల్ని చేపడతామని వ్యాఖ్యానించటం గమనార్హం.