Begin typing your search above and press return to search.

చిన్నమ్మను వెంటాడుతున్న సాయిరెడ్డి... సెటైర్లు పీక్స్!

ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Nov 2023 2:05 PM GMT
చిన్నమ్మను వెంటాడుతున్న సాయిరెడ్డి... సెటైర్లు పీక్స్!
X

గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 2019 ఎన్నికలలో పురందేశ్వరి పెర్ఫార్మెన్స్ పై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.

అవును... ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి చేసిన కామెంట్లు, ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఏమాత్రం అవకాశం ఉన్నా... గుక్క తిప్పుకోనీయకుండా చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా బీజేపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేసిన ఆమెకు వచ్చిన ఓట్లపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా నోటాకు వచ్చిన ఓట్లను గుర్తుచేయడంతో పాటు డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని ప్రాస్థావించారు. అయినప్పటికీ బీజేపీ ఆమెకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని పెద్ద సాహసంగా అభివర్ణించారు సాయిరెడ్డి.

ఇందులో భాగంగా... "బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు 2019లో విశాఖపట్నం లోక్ సభ స్థానంలో సాధించిన ఓట్లు చూస్తే కళ్లు తిరిగి కింద పడిపోవాల్సిందే. మేడంకు 'నోటా' కు పడిన ఓట్ల కంటే కొద్దిగా ఎక్కువ వచ్చాయి. 33,892 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించి బీజేపీ పెద్ద సాహసమే చేసింది" అని ట్వీట్ చేశారు.

అంతకంటే ముందు రాబోయే ఎన్నికల్లో పురందేశ్వరి ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు.. ఆమె పోటీచేయబోయే స్థానం నిర్ణయించేది పార్టీనా.. లేక, మీబావా అంటూ ఎద్దేవాచేశారు. ఆయన మద్దతు కోసమే మీద ఈగకూడా వాలనివ్వడం లేదని అన్నారు.

ఇందులో భాగంగా... "రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నారు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని! దాని గురించి ఏదైనా చెప్పగలరా పురంధేశ్వరి గారూ? మీరు పోటీ చేసే స్థానాన్ని మీ పార్టీ డిసైడ్ చేస్తుందా.. లేక, మీ బావ గారు నిర్ణయిస్తారా? ఆయన మద్ధతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు!" అని ట్వీట్ చేశారు.

ఈ విధంగా ప్రతీ అంశంలోనూ ఆల్ మోస్ట్ ప్రతీ రోజూ పురందేశ్వరిని ఆన్ లైన్ వేదికగా వెంటాడుతున్న విజయసాయిరెడ్డి... గత ఎన్నికలో బూత్ ల వారీగా పురందేశ్వరికి వచ్చిన ఓట్లను సైతం వివరించారు. బీజేపీలో ఉంటూ టీడీపీ మేలు కోరుతున్న నేతగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు!