ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి... పురందేశ్వరిని టార్గెట్ చేసిన సాయిరెడ్డి!
అవును... పురందేశ్వరి ఫ్లెక్సీలున్న ఫోటోను పోస్ట్ చేసిన సాయిరెడ్డి... ఒక కీలక వ్యాఖ్యను కామెంట్ గా పెట్టారు.
By: Tupaki Desk | 29 July 2023 6:04 AM GMTకర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో దారులు మూసుపోతోన్నాయనే వార్తలొస్తున్న నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించింది అధిష్టాణం. ఇదే సమయంలో జనసేనతోనూ పొత్తుతో ముందుకువెళ్తే... సామాజికవర్గాల సమీకరణాలు సెట్ అవుతాయని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా... ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పురందేశ్వరి ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కేడర్ లో కదలియకు చెచ్చే కార్యక్రమాలు, నాయకుల్లో నిస్తేజం తొలగించే పనులూ చేస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు పురందేశ్వరి.
ఇందులో భాగంగా... కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అనధికారిక అప్పులు మొదలైన విషయాలపై ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో వైసీపీ నేతలు పురందేశ్వరిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రి అమర్నాథ్.. ఏపీ బీజేపీ కొత్త చీఫ్ పై సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. విశాఖలో భారీ ఎత్తున కనిపిస్తోన్న ఫ్లెక్సీలపై సెటైర్ వేశారు. అవును... పురందేశ్వరి ఫ్లెక్సీలున్న ఫోటోను పోస్ట్ చేసిన సాయిరెడ్డి... ఒక కీలక వ్యాఖ్యను కామెంట్ గా పెట్టారు.
అందులో భాగంగా... "కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో.. రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
దీంతో పోస్ట్ అంతా ఒకెత్తు.. చివరిలో ప్రస్థావించిన లైన్ మరొకెత్తు అని అంటున్నారు పరిశీలకులు. బీజేపీ లో ఉన్నా, లోపాయికారిగా ఇతర పార్టీలకు పనిచేస్తుందని సాయిరెడ్డి ప్రస్థావించడం వెనక... ఏ పార్టీకి పురందేశ్వరి పరోక్షంగా పనిచేస్తున్నారనే ప్రశ్నలు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో... విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ సమస్యలను గుర్తుచేసి బిజెపిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు.