మరో ఏడు రోజులు.. సజ్జల కుమారుడు సేఫ్!
వైసీపీ ప్రధాన కార్యదర్శి, గత వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అరెస్టు సహా చర్యలను ఏపీ హైకోర్టు మరో ఏడు రోజుల వరకు వాయిదా వేసింది
By: Tupaki Desk | 30 Dec 2024 8:30 AM GMTవైసీపీ ప్రధాన కార్యదర్శి, గత వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అరెస్టు సహా చర్యలను ఏపీ హైకోర్టు మరో ఏడు రోజుల వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులపై ఉన్న సజ్జల భార్గవ రెడ్డికి సదరు మధ్యంతర ఉత్తర్వులను మరో ఏడు రోజుల వరకు హైకోర్టు పొడిగించింది. దీంతో పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోకుండా.. సేఫ్ అయినట్టే. తాజాగా సోమవారం ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి కేసు విచారణకు వచ్చింది.
తనపై నమోదు చేసిన అన్ని కేసులను కొట్టివేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భార్గవ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా ఉన్న సమయంలో(ఇప్పుడు కాదు) ఆయన అనైతిక పోస్టులను ప్రోత్స హించారన్నది ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగైదు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదులు రావడంతో వారు కేసులు నమోదు చేశారు.
తొలుత ఈ కేసులు అన్నీ ఒకే అంశానికి చెందినవి కావడంతో అన్నీ కలిపి విచారించాలని ఒకే ఎఫ్ ఐఆర్‌గా పరిగణించాలని భార్గవ రెడ్డి పిటిషన్ వేశారు. ఆతర్వాత.. దీనిని అసలు కొట్టివేయాలని కోరుతూ మరో పిటిషన్(క్వాష్) దాఖలు చేశారు. అదేవిధంగా అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై గతంలోనే రెండు సార్లు విచారించిన కోర్టు.. భార్గవ రెడ్డిని అరెస్టు చేయొద్దని, తదుపరి చర్యలు కూడా తీసుకోవద్దని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా జరిగిన విచారణలోనూ మధ్యంతర ఉత్తర్వులను మరో 7 రోజులపాటు పొడిగించారు. అయితే.. సజ్జల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ వచ్చేనెల 7కు వాయిదా వేశారు. దీంతో వచ్చే నెల వరకు సజ్జల సేఫ్ అయ్యారన్న మాట. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.