Begin typing your search above and press return to search.

జగన్‌ కనుసైగ చేసి ఉంటే టీడీపీ ఉండేది కాదు!

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్‌ టూగా చక్రం తిప్పారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 6:13 AM GMT
జగన్‌ కనుసైగ చేసి ఉంటే టీడీపీ ఉండేది కాదు!
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్‌ టూగా చక్రం తిప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఆయనకు సకల శాఖ మంత్రి అని వెటకారం కూడా చేసేవి. ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)గా, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల గత ఐదేళ్లు కీలక పాత్ర పోషించారు.

వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయాక ఇటీవల కాలంలో సజ్జల ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కనుసైగ చేసి ఉంటే టీడీపీ ఉండేది కాదన్నారు.

ఏపీలో కూటమి సర్కార్‌ అరాచకాలు చేస్తోందని మండిపడ్డారు.

వైఎస్‌ జగన్‌ను దెబ్బకొట్టాలనే తిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పవన్‌ కళ్యాణ్‌ కాషాయం పట్టి బీజేపీ కంటే తాను ముందు ఉన్నానని చెబుతున్నాడన్నారు. అయితే పవన్‌ లైన్‌ బీజేపీకి నచ్చడం లేదన్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సజ్జల అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తనకు షాక్‌ లా అనిపించిందన్నారు. కూటమి నేతలు మోసంతోనే అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మాయ లోకాన్ని రెండేళ్ల ముందు నుండే ప్రజలకు చూపించడం మొదలు పెట్టారన్నారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయరని తెలిసి కూడా ప్రజలు ఓటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని అసత్య ప్రచారం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రావడమే అరాచకం, హింసాకాండ చేపట్టిందన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదని సజ్జల ఆందోళన వ్యక్తం చేశారు. కూటమికి ఓటెస్తే అమ్మేసినట్లే అని వైఎస్‌ జగన్‌ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కూటమి నేతలు అధికారంలో ఉండి పూర్తిగా బరితెగించారని మండిపడ్డారు.

గ్రామ కమిటీల వరకూ పక్కాగా వైసీపీలో నియామకాలు చేస్తామని సజ్జల తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్వీప్‌ చేస్తామన్నారు. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సీనియర్లందరూ కలిసి కట్టుగా పని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.

తిరుపతి ప్రసాదంపై సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టి కాయలు వేసిందని సజ్జల తెలిపారు. వైఎస్‌ జగన్‌ను దెబ్బకొట్టాలనే కల్తీ ప్రసాదం అంటూ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. జగన్‌ అంటే భయపడబట్టే ఇంత నీచానికి దిగజారారని ఆరోపించారు.

సనాతన ధర్మానికి తానే చాంపియన్‌ అని పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న లైన్‌ బీజేపీ పెద్దలకు నచ్చటం లేదని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టే వీరెంత కాలం కలిసుంటారో తెలియడం లేదన్నారు. వాళ్లలో వాళ్ళే కొట్టుకునేట్లున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవన్నారు.