Begin typing your search above and press return to search.

సజ్జల ఎస్టేట్ లెక్కలు తేల్చే సర్వే.. అసలేంటి ఇష్యూ?

వైఎస్సార్ జిల్లాలోని భూములపై ఉన్న వివాదాల లెక్క తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించనున్నారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 4:51 AM GMT
సజ్జల ఎస్టేట్ లెక్కలు తేల్చే సర్వే.. అసలేంటి ఇష్యూ?
X

గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన సజ్జల రామక్రిష్ణారెడ్డికి సంబంధించిన భూములపై ఈ రోజు (గురువారం) నుంచి సర్వే షురూ కానుంది. వైఎస్సార్ జిల్లాలోని భూములపై ఉన్న వివాదాల లెక్క తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించనున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీన్ని సజ్జల వర్గీయులు ఖండిస్తున్నారు. అసలీ వివాదం ఏమిటి? ఇప్పుడేం జరగనుంది? అన్న వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో చిత్తూరు -కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జల కుటుంబానికి దాదాపు 146 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో సజ్జల సందీప్ రెడ్డికి 71.49 ఎకరాలు.. సజ్జల జనార్దన్ రెడ్డికి 16.85 ఎకరాలు.. సత్యసందీప్ రెడ్డికి 21.46 ఎకరాలతో పాటు సజ్జల విజయకుమారితో పాటు ఇతరులకు కలిపి మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లుగా చెబుతారు.

ఇందులో 55 ఎకరాలు ప్రభుత్వ .. అటవీ భూమిని అక్రమించుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి చేపట్టిన రెవెన్యూ సర్వేలో చెబుతున్నా.. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. అటవీ భూములు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ చెబుతుంటే.. అలాంటిదేమీ లేదని అటవీ శాఖ చెప్పటం గమనార్హం. అయితే.. రెవెన్యూ అధికారులు మాత్రం తమ వద్ద ఉన్న రికార్డుల్లో అటవీ భూములు ఉన్నట్లుగా వాదిస్తున్నారు. ఈ రచ్చ నేపథ్యంలో తమ భూములపై సర్వే చేయాలంటూ సజ్జల కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే సమయంలో ఈ ఇష్యూకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. అందులో సజ్జల కుటుంబీకుల చేతిలో అక్రమిత ప్రభుత్వ.. అటవీ భూములు ఉన్నట్లుగా వివరించింది. దీంతో.. మరోసారి సమగ్ర సర్వే చేపట్టటం ద్వారా భూముల లెక్క తేల్చేందుకు అవకాశం ఇవ్వాలని రెవెన్యూ వర్గాలు హైకోర్టును కోరాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సర్వేకు ఆదేశించింది. అయితే.. సర్వే సందర్భంగా పంట పొలాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేపట్టాలని ఆదేశించింది. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ముగ్గురు అధికారులతో కలిసి సర్వే చేపట్టనున్నారు. దీంతో.. కొంతకాలంగా నడుస్తున్న సజ్జల ఫ్యామిలీ ఇష్యూ తాజా సర్వేతో లెక్క తేలిపోనుందని చెప్పాలి.