సజ్జలపై వైసీపీ సవారీ.. కాడిపడేస్తున్న నేతలు ..!
వైసీపీ ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆ పార్టీ నాయకులు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా.. ప్రస్తుతం వైసీపీ పరిస్ధితి ఇబ్బందుల్లోనే ఉంది.
By: Tupaki Desk | 18 Nov 2024 5:30 PM GMTవైసీపీ ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆ పార్టీ నాయకులు ఒప్పుకొన్నా.. ఒప్పుకోకపోయినా.. ప్రస్తుతం వైసీపీ పరిస్ధితి ఇబ్బందుల్లోనే ఉంది. క్షేత్రస్థాయిలో ఒకప్పుడు జెండాలు జోరుగా ఎగిరినా..ఇప్పుడు జెండా మోసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కేసులు పెడతారన్న భయం ఒకటైతే.. పార్టీలో అధినేత తీసుకున్న నిర్ణయం కూడా కారణంగా కనిపిస్తోంది.
వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, జగన్ పాలనలో సర్కారు సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే.. మెజారిటీ నాయకులకు ఇష్టం లేదు. ఆయన సొంత పెత్తనం చేస్తుంటారని.. తమ మాటను వినిపించు కునే రకం కూడా కాదని బహిరంగ విమర్శలే చేస్తున్న వారు కనిపిస్తున్నారు. ఒకరిద్దరు నేరుగా అనలేక.. అప్పటి అధికారులను అడ్డుపెట్టుకుని సజ్జలపై నిప్పులు చెరిగిన వారు కూడా ఉన్నారు. దీంతో వైసీపీలో సజ్జల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంది.
ఇక, ఇప్పుడు సజ్జలకు రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు. దీనిని రెడ్డి సామాజిక వర్గమే జీర్ణించుకోలే కపోతోంది. ఎవరైనా పార్టీపై ఆధారపడి ఉంటారని.. పార్టీ నియమాలు నిబంధనల మేరకు నడుచుకుంటా రని నాయకులు చెబుతున్నారు. కానీ, సజ్జల మాత్రం తానుచెప్పినట్టు పార్టీ ఉండాలన్న ధోరణిని ప్రదర్శించే టైపు అని.. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తాజాగా వ్యాఖ్యానించారు. సో.. ఈయన ఉద్దేశం ఏంటనేది ఇట్టే అర్థమవుతుంది.
ఈయన ఒక్కరనే కాదు.. రెడ్డిసామాజిక వర్గంలో సజ్జలపై ఎలాంటి సానుభూతి కూడా లేదు. ఆయనపై కేసు నమోదైనప్పుడు(టీడీపీ ఆఫీసుపైదాడిలో) కొందరు నాయకులు అంతర్గత సంభాషణల్లో మంచి పని జరిగిందని కామెంట్లు చేయడంగమనార్హం. అంటే.. వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ఈయనకు రాష్ట్ర కోఆర్డినేటర్‌పదవి ఇచ్చాక.. నాయకులు ఎక్కడికక్కడ కాడి పడేసేందుకు రెడీ అయ్యారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఇదిమరింత శరాఘాతంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.