Begin typing your search above and press return to search.

నాయ‌కులు లేరు.. స‌ల‌హాదారుడే స‌ర్వం.. వైసీపీ కీల‌క నిర్ణ‌యం!

కానీ.. వారు ఎప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చి నాయ‌కుల‌తో నేరుగా సంప్ర‌దింపులు చేసిన ప‌రిస్థితి లేదు.

By:  Tupaki Desk   |   10 March 2025 9:50 AM IST
నాయ‌కులు లేరు.. స‌ల‌హాదారుడే స‌ర్వం.. వైసీపీ కీల‌క నిర్ణ‌యం!
X

సాధార‌ణంగా.. ఏ పార్టీ అయినా కీల‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్పుడు నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతుం ది. ఎంత మంది స‌ల‌హాదారులు ఉన్నా.. వారిని తెర‌చాటునే ఉంచేయ‌డం పార్టీలు చేసే ప‌ని. వాస్త‌వానికి టీడీపీకి, జ‌న‌సేనకు కూడా.. అనేక మంది స‌ల‌హాదారులు ఉన్నారు. కానీ.. వారు ఎప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చి నాయ‌కుల‌తో నేరుగా సంప్ర‌దింపులు చేసిన ప‌రిస్థితి లేదు. అంతేకాదు, కీల‌క కార్య‌క్ర‌మాల‌ను భుజాన వేసుకున్నది కూడా లేదు.

కానీ, చిత్రంగా వైసీపీలో మాత్రం కీల‌క స‌ల‌దారుడు, ప్ర‌స్తుతం అంద‌రి నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు. అన్నీ ఆయ‌నే అయినా.. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించాలని భావిస్తున్న `యువ‌త పోరు` నిర‌స‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన సంపూర్ణ బాధ్య‌త‌ల‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌కు అప్ప‌గించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయ‌న యువ‌త‌ను స‌మాయ‌త్తం చేయ‌డంతోపాటు.. ఈ నిర‌స‌న‌ను విజ‌యవంతం చేసేందుకు ప‌ని చేస్తున్నారు.

ఎందుకీ నిర‌స‌న‌..

రాష్ట్రంలో విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల‌ను కూట‌మి స‌ర్కారు విడుద‌ల చేయాల్సి ఉంది . ఇవి 3900 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని వైసీపీ చెబుతోంది. అయితే.. కూట‌మి స‌ర్కారు తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్లో 2600 కోట్ల‌ను ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల కింద చూపించింది. దీనిని వైసీపీ త‌ప్పుబ‌డుతోంది. ఇవ్వాల్సిన మొత్తం.. 3900 కోట్లు అయితే.. కూట‌మి ప్ర‌భుత్వం 2600 కోట్లు మాత్ర‌మే కేటాయించ‌డాన్ని విమ‌ర్శిస్తోంది.

ఈ నేప‌థ్యంలో పూర్తిస్థాయిలో విద్యార్థుల‌కు రీయింబ‌ర్స్‌మెంటు నిధులు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌కు యువ‌త పోరు పేరుతో వైసీపీ శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ కార్య‌క్ర మాన్ని చేప‌ట్టేందుకు, ముందుండి న‌డిపించేందుకు నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌కు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. గ‌తంలోనూ రెండు మూడు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. అవి ఫెయిల‌య్యాయి. ఇప్పుడు చేప‌డుతున్న యువత పోరు ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి.