చంద్రబాబుపై కక్ష సాధించడం లేదు: సజ్జల కామెంట్స్
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఉదయం తెలతెల వారుతూనే మీడియా ముందుకు వచ్చారు.
By: Tupaki Desk | 9 Sep 2023 4:45 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, నంద్యాల నుంచి విజయవాడకు తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నాయకులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఉదయం తెలతెల వారుతూనే మీడియా ముందుకు వచ్చారు.
చంద్రబాబుపై ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు తాము చేయడం లేదని చెప్పారు. ''చంద్రబాబుపై కక్ష సాధించాల్సిన అవసరం మాకు కానీ, మా పార్టీకి కానీ లేదు. ఆయన ఇప్పుడు వృద్ధుడు. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకుంటాం. మా పథకాలు, మా సంక్షేమంతోనే ప్రజల్లోకి వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తాం'' అని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబును దొరికిపోయిన దొంగగా ఆయన అభివర్ణించారు.
''స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకుని.. 340 కోట్ల రూపాయాల్లో రూ.240 కోట్లను దొడ్డి దారిలో సొంతం చేసుకున్నారనేది ప్రధాన అభియోగం. దీనిపై కొన్నాళ్లుగా విచారణ సాగుతోంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఆయన అరెస్టు విషయం కూడా ఆ యనకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇప్పుడు ఏమీ తెలియనట్టు రాజకీయంగా సింపతీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం'' అని సజ్జల వ్యాఖ్యానించారు.
సీఐడీ పోలీసులు.. వారి కర్తవ్యాన్ని వారు చేస్తున్నట్టు సజ్జల చెప్పారు. సీనియర్ నాయకుడిగా, మాజీ సీఎంగా చంద్రబాబు సహకరించాల్సింది పోయి.. దీనిని కూడా రాజకీయం చేస్తన్నారని విమర్శలు గుప్పించారు.
ఈ వయసులో చంద్రబాబుపై కక్ష సాధించాలని తాము అనుకోవడం లేదని, అదే నిజమైతే.. ఈ పాటికి వేరేగా చర్యలు ఉండేవని చెప్పుకొచ్చారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన కుమారుడు, భార్య, సహా కుటుంబ సభ్యులు ఎవరైనా రావొచ్చని, కానీ, రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అందుకే పోలీసులు వారి పని వారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.