Begin typing your search above and press return to search.

పవన్ మీద జగన్ కి అదే అభిప్రాయం....!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు పూనకం వచ్చినట్లుగా జగన్ మీద విరుచుకుపడతారు.

By:  Tupaki Desk   |   26 March 2024 3:50 AM GMT
పవన్ మీద జగన్ కి అదే అభిప్రాయం....!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు పూనకం వచ్చినట్లుగా జగన్ మీద విరుచుకుపడతారు. జగన్ అంటూ ఏక వచన ప్రయోగం చేస్తారు నిన్ను సీఎం గా గౌరవించను అంటారు. జగ్గూ భాయ్ అంటాను అని చెబుతారు. జగన్ ని ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్నీ అనేస్తారు పవన్.

ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో అయితే జగన్ ని పట్టుకుని పాతాళానికి తొక్కేస్తానని కూడా పవన్ ఉగ్ర రూపం దాల్చి చాలా పరుష పదజాలం ఉపయోగించారు. మరి తనను అన్నేసి మాటలు అంటున్న జగన్ మాత్రం పవన్ విషయంలో ఎక్కడా పెద్దగా నోరు జారింది లేదు.

ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్యాకేజి స్టార్ గా మారారు దత్తపుత్రుడు అని అవే మాటలను పదే పదే అంటున్నారు. ఇంతకీ వైసీపీ అధినేతకు కానీ అధినాయకత్వానికి కానీ పవన్ మీద ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే దానికి జగన్ నీడ ఆయన ఆంతరంగీకుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూర్తి స్పష్టత ఇచ్చారు.

జగన్ కి పవన్ అంటే జాలి తప్ప కోపం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ జాలి ఎందుకు అంటే చంద్రబాబు చేతిలో పడి పవన్ తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు అన్నదేనట. పవన్ కి రాజకీయంగా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని, ఆయనకు అభిమానులే పునాది అని దాన్ని వాడుకుని ఆయన ప్రజలకు సేవ చేయవచ్చు అన్నదే తమ పార్టీ అధినాయకత్వానికి ఉందని అన్నారు.

అయితే పవన్ ఆ పని చేయకుండా గత పదేళ్ళుగా పార్టీ నిర్మాణాన్ని పక్కన పెట్టేశారు అని అసలు పార్టీని ఎక్కడా బలోపేతం చేయలేదని సజ్జల అన్నారు. అంతే కాదు ఆయన గెస్ట్ గానే పాలిటిక్స్ చేస్తూ వచ్చారని ఎత్తి చూపారు. కేవలం చంద్రబాబు కోసమే పవన్ తన రాజకీయ జీవితాన్ని బలి పెట్టుకుంటున్నారు అని సజ్జల అంటున్నారు.

ఒక రాజకీయ పార్టీని పెట్టిన తరువాత ఏవరైనా కూడా దాన్ని గ్రామాలలోకి తీసుకుని వెళ్లాలని చూస్తారని పవన్ మాత్రం తన పార్టీ క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరుపుకుంటే టీఎడీపీకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని భావించి అలా చేస్తున్నారా అన్న సందేహం వస్తోంది అన్నారు.

పవన్ తన రాజకీయాన్ని కేవలం ఒక సామాజిక వర్గాన్ని మోసం చేయడానికే వాడుకుంటున్నారని పైగా జగన్ ని పట్టుకుని విమర్శలు చేస్తున్నారని పోనీ ఆయన ఏమైనా సీఎం అవుతారా అంటే అదేమీ లేదని కేవలం బాబు కోసమే ఇలా చేస్తున్నారు అందుకే ఆయన అంటే జగన్ తో సహా తమకు కోపం లేదని జాలి మాత్రమే ఉంటుందని జస్టిఫికేషన్ ఇచ్చేశారు సజ్జల.

రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ ప్రశ్నించడం కోసం పార్టీ అన్నారని ఆ తరువాత 2019లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేశారని గుర్తు చేశారు. ఇపుడు అదే చంద్రబాబుతో కలసి పవన్ పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ ని పదే పదే విమర్శించడం వల్లనే ఒక రాజకీయ పార్టీగా తాము రియాక్ట్ అవుతున్నాం తప్ప ఆయన అంటే తమకు కోపం ఎందుకు ఉంటుందని సజ్జల అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీలో వర్గ పోరాటం నడుస్తోందని రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులు కాకుండా శతృవులుగా మారిపోయారని తరచూ మేధావులు అంటూంటారు. కానీ అలాంటిది ఏమీ లేదని వైసీపీ నేతల మాటలను బట్టి అర్ధం అవుతోంది. మాటల వరకే తూటాలు పేల్చుకుంటున్నా ఎవరి మీద ఎవరికీ మనసులో ఏమీ లేదని అంటున్నారు. అంతే కాదు ఇది ఆచరణలో కూడా ఏదో ఒక వేదిక మీద చూపిస్తే జనాలకు కూడా అర్ధం అవుతుంది అని అంటున్నారు.

బహుశా 2024 ఎన్నికల తరువాత ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కొత్త మార్పులను చాలా చూడవచ్చు అని అంటున్నారు. మొత్తానికి పవన్ పట్ల కోపం లేదు అని వైసీపీ కీలక నేత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని జనసేన ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.