Begin typing your search above and press return to search.

టీడీపీని పవన్ టేకోవర్ చేస్తారు... సజ్జల సంచలన కామెంట్స్...!

టీడీపీని ఒక కంపెనీలా చంద్రబాబు నడిపారు. ఆయన ఎపుడూ తాను సీఈఓ అనే ప్రకటించుకుంటూ రాజకీయాలు చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 3:57 PM GMT
టీడీపీని పవన్ టేకోవర్ చేస్తారు... సజ్జల సంచలన కామెంట్స్...!
X

టీడీపీని ఒక కంపెనీలా చంద్రబాబు నడిపారు. ఆయన ఎపుడూ తాను సీఈఓ అనే ప్రకటించుకుంటూ రాజకీయాలు చేశారు. సాధారణంగా నష్టాలలో ఉన్న కంపెనీని వేరే ఇతర కంపెనీలు టేకోవర్ చేస్తాయి. అలా తీసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ వీక్ అయిందని చెప్పి దాని గుట్టు బయటపెట్టారు. అందుకే తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. దీని అర్ధమేంటి అంటే వీక్ అయి నష్టాలలో ఉన్న టీడీపీని పవన్ టేకోవర్ చేస్తారనే అని సజ్జల సంచలన కామెంట్స్ చేశారు.

సాధారణంగా నష్టాలలో ఉన్న కంపెనీని టేకోవర్ చేయడం అంటే ఆ కంపెనీలో ఉన్న షేర్లు ఎక్కువగా టేకోవర్ చేసిన కంపెనీ కొనుగోలు చేస్తుంది. అలా చూస్తే కనుక బలహీనం అయిన టీడీపీకే పవన్ ఇపుడు సీట్లు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుంది అని సజ్జల అంటున్నారు. అంటే వీక్ అయిన టీడీపీని బలం ఇచ్చే పార్టీగా గుడ్ పొజిషన్ లో ఉన్న జనసేన తానే టీడీపీ సేన కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తుదని సజ్జల అంటున్నారు. అలా టీడీపీకి ఇపుడు సీట్లు ఇచ్చే స్థితిలోకి పవన్ జనసేన వెళ్ళిందని ఆయన అంటున్నారు.

మరి ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు అసలు పవన్ జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ ఇన్నాళ్ళు చెప్పినట్లుగానే పవన్ ఒక నిజం ఒప్పుకున్నారని ఆయన అన్నారు. టీడీపీ వీక్ అయిందని తాము మొదటి నుంచి చెప్పిందే ఇపుడు పవన్ కూడా ఒప్పుకున్నారని ఆయన సెటైర్లు వేశారు.

టీడీపీ వీక్ అయినపుడల్లా తాను అండగా ఉంటాను అని ఒక సేవియర్ గా పవన్ ముందుకు వస్తున్నారు అని టీడీపీ కోసమే పవన్ అన్నది అలా రుజువు అవుతోందని అన్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీకి ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు స్కిల్ స్కాం లో చిక్కుకుని అరెస్ట్ అయ్యారు. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని భావించి కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. విషయం ఇలా ఉంటే జగన్ కి ఈ అరెస్ట్ తో బాబు జైలుతో ఏమిటి సంబంధం అని ఆయన నిలదీశారు.

తెలుగుదేశం పార్టీ ఊసుపోని విమర్శలు చేస్తోంది అని ఆయన అన్నారు. వారు చేసే నిరాధార ఆరోపణలకు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. బాబు ఎందుకు అరెస్ట్ అయ్యారన్నది టీడీపీకీ తెలుసని, అలాగే ప్రజలకు మొత్తం తెలుసు అని సజ్జల అన్నారు. స్కిల్ స్కాం లో అన్ని ఆధారాలు ఉన్నాయని అందుకే బాబుకు జైలు వెళ్ళే స్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు.

స్కిల్ స్కాం లో షెల్ కంపెనీలకు ప్రభుత్వం సొమ్ము వెళ్ళిందని అలా అది మళ్ళీ బాబు ఖాతాలోకే వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇక బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు ఎందుకు వెళ్ళిపోయారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వస్తే చాలా వరకూ డబ్బు ఎలా వెనక్కి వచ్చి ఎవరెవరి ఖాతాలలో చేరింది అన్నది తెలుస్తుంది అని ఆయన అన్నారు.

ఇక ఈ కేసు విషయంలో తమ నిజాయతీని నిరూపించుకోవాలంటే బాబు తన పీఏ శ్రీనివాస్ ని వెనక్కి పిలిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చాలా ఇతర కేసులతో కూడా లింకులు ఉన్నాయి. అవినీతి ఒక గొలుసుకట్టు మాదిరిగా పలు కేసులలో ఉందని అవన్నీ కలసి చాలా వాటిలో టీడీపీ అవినీతి బయటకు వస్తుందని సజ్జల అంటున్నారు.

ఇక జగన్ ఢిల్లీ టూర్ మీద కూడా టీడీపీ విమర్శలు చేయడం దారుణం అన్నారు. రేపో మాపో తెలంగాణా సహా అయిదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న వేళ ముందస్తు ఎన్నికల కోసం జగన్ ఢిల్లీకి వెళుతున్నారు అని టీడీపీ నేతలు మాట్లాడడమేంటని మండిపడ్డారు. రెండు మూడేళ్ళుగా వారు ఇదే పాటను పాడుతున్నారని అన్నారు.

చంద్రబాబుని జైలులో ఉంచడానికే జగన్ ఢిల్లీ టూర్ అన్నది అవాస్తవం అన్నారు. కోర్టుల తీర్పుల మీద బాబు కేసు ఆధారపడి ఉంటే జగన్ ఏమి చేస్తారు, కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడితే ఈ కేసులో ఏమి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ లాజిక్ లేని మాటలు అని కొట్టిపారేశారు.

తాము ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర పెద్దలను అడిగి నిధులు తెస్తున్నామని, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉండి తన స్వార్ధం చూసుకున్నారని, అదే జగన్ ఏపీ క్షేమం కోసమే కేంద్రాన్ని కలిసినపుడల్లా వినతి చేస్తూంటారు అని సజ్జల అన్నారు. ఉమ్మడి ఏపీలోనూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కంటే బాబు పొత్తు పెట్టుకుని కేంద్రం నుంచి ఏమీ తీసుకుని రాలేని దాని కంటే కూడా వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఎక్కువ నిధులే తెచ్చిందని సజ్జల పేర్కొన్నారు.