'రంగు పడుద్ది'... హోలీ వేళ సజ్జనార్ మార్క్ వార్నింగ్!
ఇక ప్రధానంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఈ బెట్టింగ్ యాప్ ల సందడి మామూలుగా ఉండదని అంటారు. ఈ సమయంలోనే సజ్జనార్ ఈ విషయాన్ని ఓ క్యాంపెయిన్ లా నడుపుతున్నారు!
By: Tupaki Desk | 14 March 2025 4:38 PM ISTదేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో ప్రజలు మునిగి తేలుతున్నారు. యువత హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో "రంగు పడుద్ది" అంటూ ఎక్స్ వేదికగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి పోస్ట్ దర్శనమిచ్చింది. అనంతరం వైరల్ గా మారింది. ఇంతకూ ఆ పోస్ట్ ఎందుకంటే... "బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే..." జరిగే పరిణామాలను హెచ్చరిస్తూ!
అవును... జూదం ఆడి బాగుపడిన వ్యక్తి ఎవరూ ఉండరని పెద్దలు చెబుతుంటారు. ఎప్పుడూ జూదం ఆడించేవాళ్లే బాగుపడతారు తప్ప.. జూదం ఆడేవాళ్లు కాదని చెబుతుంటారు. వాస్తవానికి ఒకప్పుడు పట్టణాల్లో గుర్రపు పందేలు వంటివి భారీ జూదాలుగా ఉంటే... గ్రామాల్లో పేకాట, గుండాట, కోడి పందేలు వంటివి చాలా కుటుంబాలను రోడ్లపైకి తెచ్చేశాయని చెబుతారు.
అయితే ప్రస్తుతం ఈ జూదం రూపం మార్చుకుంది.. ఆన్ లైన్ లో బెట్టింగ్ యాప్స్ రూపంలో పట్టణాలు, నగరాలు, మెట్రోపాలిటన్లు, గ్రామాలు అనే తారతమ్యాలేమీ లేకుండా ఎన్నో కుటుంబాలను బలితీసుకుంటున్న పరిస్థితి. ఇక ప్రధానంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఈ బెట్టింగ్ యాప్ ల సందడి మామూలుగా ఉండదని అంటారు. ఈ సమయంలోనే సజ్జనార్ ఈ విషయాన్ని ఓ క్యాంపెయిన్ లా నడుపుతున్నారు!
ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు అమాయకపు యువతను లక్ష్యంగా చేసుకొని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లిస్తున్నారనే విషయం సంచలనంగా మారింది. అలాంటి వారి విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ తనదైన శైలిలో బుద్ది చెబుతున్నారు. ఇలాంటివాటిని ప్రమోట్ చేసే ఇన్ ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో... హోలీ పండుగ సందర్భంగా ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇందులో భాగంగా... బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారికి రంగు పడుద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా అలాంటి వారిని ఎంతమందిని బ్లాక్ చేశారో చెప్పాలంటూ యూజర్లను సజ్జనార్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఆ వివరాలు వెల్లడించాలని కోరారు.