Begin typing your search above and press return to search.

చుట్టూ అరాచకం..అశాంతి... భారత్ సంగతేంటి ?

భారత్ శాంతి భూమి కర్మ భూమి. భారత్ లో ప్రజలు ఎక్కువగా సనాతన విశ్వాసాలు కలిగి ఉంటారు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 3:38 AM GMT
చుట్టూ అరాచకం..అశాంతి... భారత్ సంగతేంటి ?
X

భారత్ శాంతి భూమి కర్మ భూమి. భారత్ లో ప్రజలు ఎక్కువగా సనాతన విశ్వాసాలు కలిగి ఉంటారు. అలా అని పొరుగు దేశాలలో పౌరులు ఉండరని కాదు. అక్కడ అస్థిరత మొదటి నుంచి ఉంది. ఇపుడు వెల్లువగా మారింది. చిత్రమేంటి అంటే గడచిన కొద్ది కాలంలోనే భారత్ చుట్టు పక్కన ఉన్న దేశాలు అన్నీ వరసగా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి.

అక్కడ ప్రజలు హాహాకారాలు చేస్తూ ఉండడం కనిపిస్తోంది. ఆ క్షణం వరకూ దేశాన్ని శాసించిన పాలకులు ప్రాణాలు అరచేత బెట్టుకుని దేశాలు విడిచిపెట్టి పారిపోవడం అరాచకానికి అసహనానికి పరాకాష్టగా చెబుతున్నారు.

తాజా ఉదంతం బంగ్లాదేశ్ నే మొదట ప్రస్తావించుకుంటే ఆగస్ట్ 5న షేక్ హసీనా ఉన్నఫళంగా కట్టు బట్టలతో ప్రాణాలను అరచేత బెట్టుకుని దేశం విడిచి పారిపోయారు. ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించింది. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పాలించిన ఐరన్ లేడీ షేక్ హసీనా ఈ రోజు పరిస్థితి ఇది.

ఆమె హయాంలో అభివృద్ధి పరుగులు తీసింది. దేశ ఆర్ధిక వృద్ధి రేటు బాగా పెరిగింది. కానీ అతి వాద శక్తులు మాత్రం ఆమెను కూలదోయాలని అనుకున్నాయి. గద్దే దించేశాయి. ఇక శ్రీలంక సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. మహేంద్ర రాజ్ పక్షే ప్రభుత్వం అధిక ధరలు పెరిగిన ద్రవ్యోల్బణం తో పాటు ప్రజలలో పెరిగిన అసహనానికి కుప్ప కూలింది. దాంతో రాజ ప్రాసాదానికే ప్రజలు తిరుగుబాటుగా తరలివచ్చారు. అలా రాజ్ పక్సేను వెంటాడారు. కానీ ఆయన తప్పించుకుని పారిపోయారు.

ఇక పాకిస్తాన్ కి 2022 దాకా ఎదురులేని విధంగా పాలించిన ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాసం పెట్టి గద్దె దించేశారు. ఆయన పరిస్థితి చూస్తే ప్రస్తుతం కారాగార వాసంతో మగ్గుతున్నారు. ఆయనకు ప్రాణహాని కూడా ఉందని అంటున్నారు. రెండేళ్ళుగా ఆయన జైలు గోడల మధ్యనే గడుపుతున్నారు. అక్కడ సైన్యం గుప్పిట పాలన సాగుతోంది.

అక్కడ సైన్యం నియమించిన ప్రభుత్వం పేరుకే ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఏమీ కంట్రోల్ చేయలేకపోతోంది. ఆకలి, నిరుద్యోగం, పేదరికం తో పాకిస్థాన్ ఎన్నడూ చూడని ఇబ్బందులు పడుతోంది. పాకిస్థాన్ కి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దాంతో ప్రజలలో తిరుగుబాటు వస్తోంది. ఇదే అదనుగా ఉగ్ర వాదులు రెచ్చిపోతున్నారు. వారు పాలకులనే సవాల్ చేస్తున్నారు.

ఇక ఇదే తీరున మరో దేశం ఉంది అదే ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ప్రజా ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి తాలిబాన్లు అధికారం అందుకున్నారు. మధ్య యుగం నాటి శాసనాలతో పాలన చేస్తున్నారు. అత్యంత దయనీయమైన పరిస్థితులు ఆఫ్ఘాన్ లో ఉన్నాయి. ఈ రోజుకీ తాలిబన్ల పాలనను ప్రపంచం అంగీకరించలేదు. ఏ దేశమూ వారిని గుర్తించడం లేదు. అక్కడ ప్రజలు అసహనంతో ఉన్నారు. అరాచకం అక్కడ కనిపిస్తోంది.

అలాగే భారత్ పొరుగున ఉన్న మయన్మార్ ని తీసుకున్నా అరాచకమే చిరునామాగా మారింది. అక్కడ కూడా సైన్యందే పాలన. వారి నియంత పోకడలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఎదురు నిలిస్తే కాల్చి చంపుతున్నారు. అయినా సరే ప్రజలలో పెల్లుబికిన అసహనం అరాచకంగా మారి తిరుగుబాటు వైపుగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే మయన్మార్ లో అంతర్యుద్ధం చాన్నాళ్ళుగా సాగుతోంది. ఇలా చుట్టు పక్కన ఉన్న దేశాలు అన్నీ అరాచకంతో నిండిపోతున్నాయి.

ఈ నేపధ్యంలో భారత్ లోనూ అలాంటి పరిస్థితులు వస్తాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. విపక్షాలు. షేక్ హసీనాను పట్టిన గతే ప్రధాని మోడీకి కూడా పడుతుందని మధ్యప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బంగ్లా తరహాలో మోడీ ఇంటి ముందుకు వచ్చి ఏదో రోజున ప్రజలు దానిని ఆక్రమించుకుంటారు అని ఆయన అంటున్నారు.

అయితే విపక్షాలు రాజకీయంగా విభేదించవచ్చు విమర్శలు చేసుకోవచ్చు కానీ పొరుగు దేశాల అరాచకాన్ని భారత్ లో కూడా రావాలని కోరుకోవడం మాత్రం తగదని అంటున్నారు. భారత్ లో స్వేచ్చ ఉంది. ఆందోళన చేసేందుకు మాట్లాడేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వాలు మొండిగా ఉంటే దింపేందుకు ఎన్నికల వ్యవస్థ అనేది గట్టిగా ఉంది. అందువల్ల భారత్ లో అలాంటివి జరగరాదు అనే అంతా కోరుకుంటున్నారు. భారత్ లో అలాంటివి జరగకపోయినా పొరుగు దేశాల్లో ఉన్న సంక్షోభాల వల్ల భారత్ ఆర్ధికంగా ఇతరత్రా అనేక ఇబ్బందులు మాత్రం పడుతోంది. అందుకే పొరుగు వారు కూడా బాగుండాలని కోరుకోవాలి.