కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరికలు ఆగాయా ?
వైసీపీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేరికలు ఉంటాయని ప్రచారం ఇటీవల కాలంలో సాగింది. వరసబెట్టి బడా నాయకులు ఫ్యాన్ నీడకు చేరుకుంటారని కూడా చెప్పుకున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2025 3:36 AM GMTవైసీపీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేరికలు ఉంటాయని ప్రచారం ఇటీవల కాలంలో సాగింది. వరసబెట్టి బడా నాయకులు ఫ్యాన్ నీడకు చేరుకుంటారని కూడా చెప్పుకున్నారు. ప్రధమంగా మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ గత వారం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో గత తొమ్మిది నెలలుగా పోయేవారే తప్ప వచ్చే వారు లేక వైసీపీ తీవ్ర నిరాశలో ఉన్న వేళ ఈ చేరిక అయితే పార్టీలో ఎంతో ఊపుని ఇచ్చింది.
ఇక ఇదే క్రమంలో మరింత మంది వస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. అందులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వంటి వారి పేర్లు వినిపించాయి. అయితే ఆ దిశగా అడుగులు అయితే పడడం లేదు. ఈ మధ్యలో శైలజానాధ్ అనంతపురంలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ అంటే ఆరాధనా భావం తమకు ఉందని అన్నారు. వైఎస్సార్ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని కోరుకున్నారు.
అంతవరకూ బాగానే ఉన్నా వైఎస్ విజయమ్మను వైసీపీ అధ్యక్షురాలిగా చేయాలని ఆయన సూచించడంతో అది పార్టీలో చర్చగా మారింది. జగన్ అధినేతగా ఉండగా ఆయన చేత మెడలో కండువా కప్పించుకుని ఆయన కాదు ఆమె ప్రెసిడెంట్ అని ఆ వెంటనే అనడం ద్వారా అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు సాకె శైలజానాధ్. కానీ అదే సమయంలో వైసీపీ ప్రాంతీయ పార్టీ అన్న సంగతిని ఆయన కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవంలో మరచినట్లున్నారు అన్న కామెంట్స్ వచ్చాయి.
అయితే దాని మీద వైసీపీ అధినాయకత్వం తక్షణం ఏమీ అనకపోవచ్చు కానీ శైలజానాధ్ విషయంలో కొంత ఆలోచనలో పడుతుందని కూడా అంటున్నారు బహుశా కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్లతో వైసీపీకి ఇది ఒక అనుభవం గా కూడా ఉంటుందని అంటున్నారు. మరి దీనిని చూసిన మీదట కాంగ్రెస్ నుంచి ఇతర నేతలకు ఆహ్వానం పలకడానికి వైసీపీ తానుగా సిద్ధంగా లేదా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఒకవేళ వైసీపీ పిలిచినా వెళ్ళేందుకు వీరంతా సిద్ధంగా లేరా అన్నది మరో చర్చ.
ఎందుకంటే ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ లెక్క వేరు. అక్కడ హాయిగా ఏమైనా ఎంతైనా మాట్లాడవచ్చు. అదే వైసీపీ లాంటి చోట కుదరదు. పైగా వైసీపీ అధినాయకత్వం వైఖరితో తమకు సరిపడదని భావించే వారూ ఉన్నారని అంటున్నారు. మరి ఏది ఏమైనా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరికలు ఉంటాయా లేక ఆగాయా అన్నది చర్చ అయితే నడుస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ సమర్ధులైన నాయకులను నవతరం నేతలను తానుగా తయారు చేసుకుంటే మంచిదన్న చర్చ కూడా సాగూతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ విధంగా కొత్త వారికి యువకులకు పెద్ద పీట వేయాలని కోరుతున్నారు. పార్టీ మరింతకాలం జనంలో ఉండాలంటే కొత్త నీరు రావాలని అంటున్నారు సీనియర్లను తెచ్చినా వారు సలహాలు మాత్రమే ఇస్తారని దాని వల్ల పార్టీ జనంలోకి ఎంతవరకూ పోతుందని కూడా అంటున్నారు. పనిచేసే వారు ప్రభుత్వం మీద పోరాడేవారు గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా నిలబడే వారు వైసీపీకి ఇపుడు అవసరం అన్న మాట అయితే ఉంది.