వైసీపీలో 'సాకే' కొత్త ఇన్నింగ్స్.. !
ఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి.. డాక్టర్ సాకే శైలజానాథ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సమ యం చేరువైంది.
By: Tupaki Desk | 7 Feb 2025 5:18 AM GMTఏపీ పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి.. డాక్టర్ సాకే శైలజానాథ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సమ యం చేరువైంది. శుక్రవారం లేదా శనివారం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఈ చేరికకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. వైసీపీ అధినేత జగన్ నుంచి సాకేకు బలమైన మద్దతు లభించడంతోపాటు.. పార్టీలోనూ కీలక పోస్టు ఇచ్చేందుకు అంగీకరించారని.. తెలిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్న సాకే కు వివాద రహితుడిగా పేరుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉన్న నాయకుల్లో సీమకు చెందిన సాకే ఒకరు. 2004, 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ శింగనమల నియోజకవర్గం నుంచి సాకే విజయం దక్కించుకున్నారు. అప్పటి మంత్రివర్గంలోనూ ఆయన చోటు దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో విభజన ఎఫెక్ట్‌తో పార్టీ చిత్తు అయి పోయిన తర్వాత.. అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తన బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నా రు. అప్పట్లో జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్‌గాంధీ ఏఐసీసీ చీఫ్ పదవికిరాజీనామా చేయడంతో సంఘీభావంగా రఘువీరా కూడా పదవిని వదులుకున్నారు. ఈ క్రమంలోనే సాకే శైలజానాథ్ పీసీసీ పగ్గాలు చేపట్టారు. ఈయన ఆధ్వర్యంలోనే 2019లో ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా ఘోర పరాజయం పాలైంది. వాస్తవానికి పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నించినా.. పరిస్థితులు సాకేకు అనుకూలంగా లేకపోవడం గమనార్హం. దీంతో 2024 ఎన్నికలకు ముందు వైఎస్ తనయ షర్మిల ఎంట్రీ ఇచ్చారు.
ఇక, సాకే వ్యక్తిగత విషయానికి వస్తే.. వృత్తి రీత్యా వైద్యుడు అయిన ఆయన.. రాజకీయాల బాట పట్టారు. వివాద రహితుడిగా.. ఆయన గుర్తింపు పొందారు. ప్రత్యర్థులతోనూ మిత్రత్వం నెరిపే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. షర్మిల హయాంలో గుర్తింపు కోల్పాయామన్న ఆవేదనలో ఉన్న నాయకులలో సాకే ఒకరు. కొన్నాళ్లుగా ఆయన వైసీపీకిసానుకూలంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రెండు సార్లు జగన్‌తో భేటీ అయి పార్టీలో చేరికకు సంబంధించి.. చర్చించడం.. చేరికకు జగన్ కూడా ఆమోదం తెలపడంతో సాకే వైసీపీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.